గురి.. ‘ఎంపీ’గిరి..

TRS And Congress Party Focus On Lok Sabha Election - Sakshi

లోక్‌సభ వైపు కాంగ్రెస్‌ నేతల చూపు 

ఇప్పటి నుంచే ఢిల్లీ స్థాయిలో  ఆశావహుల ప్రయత్నాలు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలపై దృష్టి 

ప్రజాకూటమి కొనసాగితే సీటు ఎవరికి దక్కేనో? 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి జిల్లాలో సానుకూల ఫలితాలు లభించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ఖమ్మం జిల్లాకు గల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌లోని అనేక మంది ముఖ్య నేతలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా.. జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉండడమే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్న నేతలు.. ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి.. టికెట్‌ కోసం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు ప్రచారమవుతోంది.

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రంతోనే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐల మధ్య ఏర్పడిన ఎన్నికల పొత్తు కారణంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ అభ్యర్థి నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి కపిలవాయి రవీందర్, టీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ బుడాన్‌బేగ్‌ పోటీ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతోపాటు అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో తన సత్తా చాటుకుంది.

తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఆ ముగ్గురు వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయకపోవడం.. ఆ పార్టీ మద్దతిచ్చిన సీపీఐ అభ్యర్థి నారాయణ ఓటమి చెందడంతో ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థులు రంగంలో ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. నేతలు టికెట్‌ కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత పదవులకు సైతం తీవ్ర పోటీ ఉంటుంది. ఈ దశలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఖమ్మం లోక్‌సభపై దృష్టి సారించిన నేతలు పలువురు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అంశంపై అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని పట్టుబట్టి తమ వర్గానికి ఇప్పించుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ అంశంలో ప్రాధాన్యం ఏ విధంగా ఉంటుందనే అంశంపై పలువురు నేతలు ఆచితూచి అంచనాలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించి.. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్ల సర్దుబాటు చేయాల్సి రావడంతో జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ నేతలకు పోటీ చేసే అవకాశం చివరి నిమిషంలో చేజారింది. దీంతో తమకు అధిష్టానం లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో పలువురు నేతలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. 

మహబూబాబాద్‌పై ఆసక్తి 
ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలు మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పోటీ చేశారు. ఈసారి సైతం ఆయన రంగంలో ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఇటీవల మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ వంటి నేతల పేర్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందా? టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమితో కలిసి పోటీ చేస్తుందా? అనే అంశంపై పార్టీ వర్గాల్లో స్పష్టత రాని పరిస్థితి. ఒకవేళ ప్రజాకూటమి పొత్తు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొనసాగితే.. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ, అప్పటి వరకు తమది సిట్టింగ్‌ స్థానమని టీడీపీ ఈ నియోజకవర్గాన్ని అడిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2009లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. అదే ప్రాతిపదికన టీడీపీ ఈ సీటు కోరే అవకాశం ఉందని.. అటువంటి పక్షంలో సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ మధ్య సీటు విషయంలో పోటీ తప్పదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్‌ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో టీడీపీ విజయం సాధించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంతో భాగస్వామ్య పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top