ఆ ఆరింటిలోనే!

Train Accident With Loco Pilot Negligence - Sakshi

20 ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌  

6 స్టేషన్లలో మాత్రం హోమ్‌ సిగ్నలింగ్‌  

ఇక్కడ అప్రమత్తతే కీలకం  

కాచిగూడ ప్రమాద ఘటనలో డ్రైవర్‌ నిర్లక్ష్యం  

స్టార్టింగ్‌ సిగ్నల్‌ ఇవ్వకుండానే కదిలిన రైలు  

సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌ ఏమరుపాటు వల్లే కాచిగూడ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా నగరంలోని ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో రైలు 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆటోమేటిక్‌గా సిగ్నల్‌ పడుతుంది. దాంతో రైలు ముందుకు వెళ్తుంది. కానీ 6 ప్రధాన స్టేషన్లలో మాత్రం హోమ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పని చేస్తోంది. ఈ ఆరింటిలో స్టార్టింగ్‌ సిగ్నల్‌ అందితేనే రైలు ముందుకు కదులుతుంది. సోమవారం కాచిగూడ స్టేషన్‌లో 2 నిమిషాలు ఆగిన ఎంఎంటీఎస్‌ స్టార్టింగ్‌ సిగ్నల్‌ వెలగకుండానే బయలుదేరింది. ఆ సమయంలో అదే ట్రాక్‌పై వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హోమ్‌ సిగ్నల్‌ పడింది. ఇది గమనించకుండానే ఎంఎంటీఎస్‌ దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొట్టింది. ఇదంతా కాచిగూడ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో 30 సెకన్ల వ్యవధిలో జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్‌లో మొత్తం 45 కిలోమీటర్ల పరిధిలో 26 స్టేషన్ల మీదుగా ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 20 స్టేషన్లు ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థపై ఆధారపడి ఉండగా... ఆరింటిలో మాత్రం హోమ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పని చేస్తోంది. అంటే లోకోపైలెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ అందితే తప్ప ముందుకు వెళ్లడానికి వీల్లేదు.

హోమ్‌ సిగ్నలింగ్‌ ఎక్కడెక్కడ?   
సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్‌నుమా, లింగంపల్లి, నాంపల్లి, హఫీజ్‌పేట్‌ స్టేషన్లలో ఎంఎంటీఎస్‌తో పాటు ఇతర రైళ్ల రాకపోకల కోసం హోమ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉంది. పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఒక దానిపైనున్న రైలు బయలుదేరితే తప్ప మరో దానికి అవకాశం లభించదు. కంట్రోల్‌ సెంటర్‌ రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ ద్వారా రైళ్లకు ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు మిగతా 5 స్టేషన్లలోనూ ఇదే విధంగా సిగ్నలింగ్‌ వ్యవస్థ పని చేస్తోంది. కాకినాడ, విశాఖ నుంచి వచ్చే పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించడం వల్ల అక్కడ రైళ్లు హోమ్‌ సిగ్నలింగ్‌పై ఆధారపడి రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌ తర్వాత నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లు. ఇక్కడ పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ఉంటాయి. అలాగే మహబూబ్‌నగర్, కర్నూల్, ఉందానగర్‌ నుంచి వచ్చే రైళ్లతో ఫలక్‌నుమా రద్దీగా ఉంటుంది. హఫీజ్‌పేట్‌ మీదుగా కొన్ని రైళ్లను మళ్లిస్తారు. దీంతో ఈ ఆరు హోమ్‌ సిగ్నలింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆయా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో ‘స్టార్టింగ్‌’ సిగ్నల్‌ అందితే తప్ప ముందుకు కదలడానికి అవకాశంఉండదు. 

2నిమిషాల సమయం  
నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి, బోరబండ, బేగంపేట్, జామై ఉస్మానియా, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, ఉప్పుగూడ తదితర ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ ద్వారా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్లలో కేవలం ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలే ఉంటాయి. దీంతో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సిగ్నల్‌ వస్తుంది. లోకోపైలెట్‌లు సిగ్నల్‌ కోసం ఎదురు చూడకుండానే 2 నిమిషాలు ఆగిన తరువాత వాకింగ్‌ స్పీడ్‌తో రైలును కదిలిస్తారు. ఆటోమేటిక్‌గా సిగ్నల్‌ అందుతుంది. దీంతో రైలు వేగాన్ని పెంచేస్తారు. నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ఇదే పద్ధతిలో రాకపోకలు సాగిస్తున్నాయి. 

వేగం ఎక్కువే...  
సాధారణంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు 25 కేవీ విద్యుత్‌ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పాత రైళ్లకు వన్‌ ఫేజ్‌ విద్యుత్‌ మోటార్‌ పని చేస్తుండగా.. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లకు (టెటీస్కోపిక్‌ కోచ్‌లు ఉన్నవి) త్రీ ఫేజ్‌ మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లు బయలుదేరిన క్షణాల్లోనే వేగాన్ని అందుకుంటాయి. ‘కాచిగూడలో ప్రమాదానికి కారణమైన ట్రైన్‌ కూడా టెటీస్కోపిక్‌ కోచ్‌లతో కూడి, త్రీ ఫేజ్‌ మోటార్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో హంద్రీని ఢీకొనే సమయానికి కనీసం 50 కిలోమీటర్ల వేగంతో ఉండి ఉంటుంది. ఆ సమయంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ 10 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా  లూప్‌లైన్‌లో ట్రాక్‌ మారుతుండడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top