‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’

సాక్షి, హైదరాబాద్ : నల్లమలలో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర జంతు పరిరక్షణ బోర్డుతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు వెనక్కు తీసుకోవాలని కోరారు. లేకపోతే అచ్చంపేట నుంచి ‘ఛలో ప్రగతి భవన్’ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ అధికార ప్రతినిధుల సమావేశం గాంధీభవన్‌లో జరిగింది.
ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. యురేనియం కంటే బొగ్గు గనుల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందని కిషన్‌రెడ్డి అనడం ఆయన అవగాహనారాహిత్యమన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలను పిలుచుకొని తెలుసుకోవాలని కేంద్రమంత్రికి సలహా ఇచ్చారు. యురేనియం ద్వారా గాలి, నీరు కాలుష్యమవుతాయని.. అడవి, చెంచులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చామని ఒప్పుకున్న మల్లురవి, కడపలో జరుగుతున్న నష్టం చూశాక వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. యురేనియం పేరుతో తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టవుతుందనీ, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి మైనింగ్‌ను రద్దు చేయించాలని సూచించారు.
మరోవైపు నేటి నుంచి కాంగ్రెస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు మల్లు రవి వెల్లడించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉంటుండగా కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి