పులులు ఎప్పుడూ ఒంటరిగానే జీవిస్తాయి 

Tigers always live alone - Sakshi

 వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న పులుల గుంపు వీడియో నకిలీదే

వన్యప్రాణి సంరక్షణ ప్రత్యేక అధికారి శంకరన్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పులి ఒంటరిగా జీవించడానికే ఇష్టపడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా వలస వెళ్లవని వన్యప్రాణి సంరక్షణ విభాగం ప్రత్యేక అధికారి శంకరన్‌ తెలిపారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి బల్హర్షా జాతీయ రహదారి మీదుగా రాష్ట్రంలోని కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్టుకు 19 పులులు వలస వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోకి పులులు వలస వస్తున్న మాట నిజమేనన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

తాడోబా అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కొత్త పులులు అక్కడ మనుగడ సాగించలేక కవ్వాల్‌ రిజర్వ్‌ ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్నాయని, ఆ దృశ్యాలు అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిక్కాయని శంకరన్‌ తెలిపారు. వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో తరహాలో గుంపులుగా రావని, పులి ఎప్పుడైనా ఒంటరిగానే ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పారు. తాడోబా నుంచి నిల్వాయి ఫారెస్టు ఏరియాకు రెండు, ఆదిలాబాద్‌ రేంజ్‌లోకి ఒకటి, జన్నారం ఫారెస్టులోకి ఒకటి, కాగజ్‌నగర్‌ రేంజ్‌ ఫారెస్టులోకి నాలుగు పులుల చొప్పున కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోకి వలస వచ్చినట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top