బడ్జెట్‌ సమావేశాలు కుదింపు!

There Will Be Changes In Assembly Schedule Due To Coronavirus In Telangana - Sakshi

‘కోవిడ్‌’ నేపథ్యంలో అసెంబ్లీ షెడ్యూలులో మార్పు?

నేడు పద్దులపై చర్చ.. రేపు ద్రవ్య వినిమయ బిల్లు 

సాక్షి, హైదరాబాద్‌: ‘కోవిడ్‌’పై అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలనూ కుదించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 20న ముగియాల్సి ఉంది. కోవిడ్‌పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో శనివారం మధ్యాహ్నం సీఎం.. ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం, రాత్రి ప్రగతి భవన్‌లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని శనివారం ఉదయమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్‌ సమావేశాలను 16వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. దీంతో సభ కార్యకలాపాల షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020–21ను ప్రవేశ పెట్టారు. 2 రోజుల సాధారణ చర్చ అనంతరం, శుక్ర, శనివారాల్లో శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు 15 పద్దులపై చర్చించి శాసనసభ ఆమోదించింది. 16 నుంచి 19 వరకు మరో 25 పద్దులౖ పె చర్చించేలా బీఏసీలో తొలుత షెడ్యూలు సిద్ధం చేశారు. తాజాగా సమావేశాలను కుదించాలని నిర్ణయించడంతో 15, 16 తేదీ ల్లోనే సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ షెడ్యూలులో 15న, ఆదివారం విరామం ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు కూడా పద్దులపై చర్చిస్తారు. 25 పద్దులకు గాను నీటిపారుదల, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌ వంటి కీలక పద్దులకే చర్చను పరిమితంచేసే అవకాశం ఉంది. చర్చకు నోచుకోని మిగతా పద్దులను గిలొటిన్‌ చేసే అవకాశముంది. 20న ప్రవేశ పెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లును 16న ప్రవేశపెట్టి ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేస్తారు.

సోమవారం మండలి సమావేశం 
ఈ నెల 6 నుంచి 14 వరకు జరిగిన శాసన మండలి.. బీఏసీ నిర్ణయం మేరకు తిరిగి 20న సమావేశం కావాల్సి ఉంది. తాజాగా మండలి షెడ్యూల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 16న సమావేశమయ్యే శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ మేరకు శాసనమండలిని సోమవారానికి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కాగా బీఏసీ సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆది, సోమవారాల్లో ప్రశ్నోత్తరాలను శాసనసభ నిబంధన 38 కింద రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం రాత్రి బులెటిన్‌ విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top