పట్టపగలే భారీ చోరీ  

Theft In Rangareddy - Sakshi

శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

తాళం పగులగొట్టి 50తులాల బంగారం, రూ.5లక్షల నగదు అపహరణ

కొత్తూరు రంగారెడ్డి : కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం భారీ చోరీ జరిగింది. ఓ కుటుంబం పక్కనే జరుగుతున్న బంధువుల శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 50తులాల బంగారం, రూ.5లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితులు, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ కథనం ప్రకారం... మండల కేంద్రంలోని పెంజర్ల బైపాస్‌ రోడ్డు పక్కన నివాసం ఉంటున్న గుబ్బ లింగం కుటుంబ సభ్యులు ఉదయం 11గంటలకు నారాయణగూడ కాలనీలో ఉండే తన తమ్ముడు వెంకటేష్‌ ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లారు. తిరిగి 3గంటల ప్రాంతంలో ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికెళ్లి పరిశీలించారు.

కాగా అంతకు ముందే వారు ఈ నెల 30న జరిగే శుభాకార్యం(పెళ్లి) కోసం బ్యాంకు లాకర్‌లో దాచిన బంగారు ఆభరణాలతో పాటు, వారి కూతుళ్ల బంగారు ఆభరణాలను ఇంట్లో దాచి శుభాకార్యం వద్దకు వెళ్లారు. వారు వచ్చే సరికి దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు 50తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం హైదరాబాద్‌ నుంచి వచ్చిన క్లూస్‌టీం సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. జాగిలం సంఘటన స్థలం నుంచి వినాయకస్టీల్‌ కూడలీలో ఉన్న ఓ పంక్ఛర్‌ దుకాణం వద్దకు వెళ్లి ఆగిపోయింది. బాధితుడు గుబ్బలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసును సాధ్యమైనంత త్వరగా చేధిస్తామని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ తెలిపారు. ఇదే ఇంట్లో గతంలో మూడు సార్లు చోరీలు జరగడం కొసమెరుపు.   

మరోఘటనలో 8తులాల వెండి ఆభరణాలు చోరీ..

పరిగి : ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇళ్లంతా ఊడ్చేశారు. ఈ సంఘటన పరిగిలోని బాలాజీనగర్‌ పద్మావతి కాలనీలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పూడూరు మండల పరిధిలోని కంకల్‌ గ్రామానికి చెందిన యూసుఫ్‌ కుటుంబ సభ్యులు పరిగిలోని పద్మావతి కాలనీలో నివాసముంటున్నారు. కాగా మంగళవారం బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు.

ఇది గమనించిన దొంగలు తాళం పగులకొట్టి ఇంట్లో చొరబడ్డారు. శబ్ధానికి పక్కవారు లేస్తే బయటకు రాకుండా ఉండేందుకు పక్కింటికి గడియ పెట్టారు. బీరువా తాళాలు పగలగొట్టి 8తులాల వెండి ఆభరణాలు, రూ.2వేల నగదుతో పాటు 25ఖరీదైన చీరలు తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున గడియ పెట్టి ఉండటం గమనించిన పక్కింటివారు మరో ఇంట్లో ఉండే వాళ్లకు ఫోన్‌ చేసి తీయించుకున్నారు. అనంతరం పక్కింట్లో దొంగతనం జరిగిందని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం పోలీసులు సంఘటణ స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top