సర్వే గడబిడ! | Sakshi
Sakshi News home page

సర్వే గడబిడ!

Published Sat, Aug 9 2014 12:34 AM

the shortage in economic and social survey

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాం గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్వేకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం గండంగా మారింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లోని జిల్లా పరిధి సర్వే బాధ్యత లు గ్రేటర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నా.. గ్రామీణ ప్రాంతంలో సర్వే నిర్వహణకు తగి నంత ఉద్యోగులు లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తోంది.

 ఈ నెల 19న గ్రేటర్ పరిధి మినహా 7,41,600 ఇళ్లలో ‘ఆర్థిక, సామాజిక సర్వే’ నిర్వహించేందుకు 28,447 మంది అవసరమని లెక్కగట్టారు. దీంట్లో కేవలం 17,617 మంది మాత్రమే అందుబాటులో  ఉండడం, ఇంకా 10,830 మంది సిబ్బంది కొరత ఉండడం జిల్లా యంత్రాంగాన్ని వేధిస్తోంది. శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సర్వేకు సరిపడే స్థాయిలో సిబ్బందిని సమకూర్చుకోవడం కష్టతరంగా మారినందున, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు.

ఇటీవల ఎన్నికల విధుల్లో నూ వీరి సేవలు వినియోగించుకున్నామని, ఇప్పుడు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తే సర్వే సిబ్బంది కొరతను అధిగమిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రేమండ్ పీటర్.. ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ప్రైవేటు ఉద్యోగులను వినియోగించుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో దీన్ని సడలిస్తే కానీ గండం గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. పట్టణ ప్రాంతాలను సర్వే నుంచి మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాలకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం పెద్ద కష్టంకాబోదని భావించిన అధికారగణానికి తాజా పరిణామం మింగుడు పడకుండా ఉంది. సర్వే నిర్వహణపై రెండు రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాల్సివుండగా, ఇప్పటివరకు సిబ్బంది సేకరణపై స్పష్టత రాకపోవడం చికాకు కలిగిస్తోంది.

Advertisement
Advertisement