ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ! | Sakshi
Sakshi News home page

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ!

Published Tue, Feb 20 2018 2:21 AM

TG Muslim, ST Reservations bill pending - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు పీటముడి పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని రెండు శాఖలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ బిల్లును నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు సూచించింది. మొత్తం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయంటూ డిసెంబర్‌ 11నే ఆఫీస్‌ మెమొరాండం పంపించింది. మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులోని అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 9.08 శాతం ఎస్టీ జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్ల తెలిపింది. మొత్తం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎస్టీల రిజర్వేషన్‌ 9.08 శాతానికి తగ్గకూడదంటూ డిసెంబర్‌ 18న కేంద్ర హోంశాఖకు ఆఫీస్‌ మెమోరాండం పంపింది. మొత్తంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్‌లో పెట్టింది.

పది నెలలుగా నిరీక్షణ
ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, 6 శాతమున్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని దాదాపు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఏప్రిల్‌ 16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతానికి, ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరిందని.. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరినట్లయింది.

సందేహాలు లేవనెత్తిన డీవోపీటీ
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులోని ప్రతిపాదనలను కేంద్ర డీవోపీటీ సున్నితంగా తిరస్కరించింది. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 (4) ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఇవ్వొచ్చని, అందుకు సహేతుక కారణాలు చూపాలని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం చేసిన సూచనలను ప్రస్తావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో అటువంటి కారణాలు, అసాధారణ పరిస్థితులేమీ చూపలేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఓబీసీలకున్న 27 శాతం రిజర్వేషన్లలో.. మైనారిటీలకు ఉప కోటా కింద 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement