పరుగో పరుగు! | Tests are a priority as covid cases are on the rise in Telangana | Sakshi
Sakshi News home page

పరుగో పరుగు!

Jun 25 2020 5:17 AM | Updated on Jun 25 2020 5:17 AM

Tests are a priority as covid cases are on the rise in Telangana - Sakshi

ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న నరేందర్‌ (పేరు మార్చాం) వరుసగా రోజూ జ్వరం వస్తుండటంతో సచివాలయం సమీపంలోని ప్రభుత్వ ల్యాబ్‌ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ పరీక్ష చేయించుకున్నాడు. మరుసటి రోజు రిపోర్ట్‌లో నెగిటివ్‌గా వచ్చింది. తర్వాత మూడ్రోజులకు స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా వచ్చింది. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. అంతలోనే ఆశ కార్యకర్త సైతం ఫోన్‌ చేయడంతో ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. తొలుత నెగిటివ్, తర్వాత పాజిటివ్‌ రావడంతో అతని కుటుంబం సైతం తీవ్ర షాక్‌కు గురైంది. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలతో ప్రైవేటు ల్యాబ్‌లు కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు కోవిడ్‌–19 పాజిటివ్‌ వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న క్రమంలో చాలామంది కాస్త నలతగా అనిపించినా కరోనా టెస్ట్‌ కోసం ప్రైవేటు ల్యాబ్‌కు పరుగులు తీస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షకు డాక్టర్‌ ధ్రువీకరణ తప్పనిసరి. అంతేకాకుండా సదరు వ్యక్తికి ప్రభుత్వం నిర్దేశించిన లక్షణాలుంటేనే పరీక్షకు అర్హులు. కానీ ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకుంటున్న వారిలో చాలామందికి కనీస లక్షణాలే ఉండటం లేదు.  పైగా డాక్టర్‌ ధ్రువీకరణ లేకుండానే పరీక్షలు కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో కొన్ని ల్యాబ్‌లు అదే పేరిట నడుస్తున్న మిగతా బ్రాంచ్‌ల నుంచి కూడా శాంపిల్స్‌ సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం. 

సర్కారు ల్యాబ్‌లో పరీక్షలకు నిబంధనలు.. 
రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 10 ప్రభుత్వ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. ఈ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలంటే కోవిడ్‌–19కు సంబంధించిన కచ్చితమైన లక్షణాలు, ట్రావెల్‌ హిస్టరీ, కోవిడ్‌–19 పేషెంట్‌తో కాంటాక్టయినట్లు స్పష్టమైతేనే అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగతా వారికి శాంపిల్‌ తీసుకుని పరీక్షలు చేసేందుకు సుముఖత చూపడం లేదు. మరోవైపు పరీక్షలు చేసినప్పటికీ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇటు పేషెంట్‌కు ఇస్తున్న రిపోర్టులో నెగిటివ్‌ వచ్చినా.. తర్వాత 2, 3 రోజులకు పాజిటివ్‌ అని చెప్పి అయోమయానికి గురిచేసిన ఘటనలు ఉంటున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్ష ఫలితాల్లో పాజిటివ్‌ ఉంటేనే సదరు వ్యక్తికి సమాచారం ఇస్తున్నారు. నెగిటివ్‌ వస్తే కనీసం ఎస్‌ఎంఎస్‌ కూడా పంపడం లేదు. దీంతో     ఖర్చైనా ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు. 

సామర్థ్యానికి మించి... 
ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతివ్వడమే తరువాయి.. ల్యాబ్‌లు పరీక్షలను వేగవంతం చేశాయి. ల్యాబ్‌ స్థితి, మౌలిక వసతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్‌లకు రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహించాలో స్పష్టం చేసింది. కానీ ప్రైవేటు ల్యాబ్‌లు చాలావరకు సామర్థ్యానికి మించే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన చోట కాకుండా ఆ ల్యాబ్‌ బ్రాంచ్‌ల నుంచి కూడా శాంపిల్స్‌ తీసుకుంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో శాఖలున్న ఓ పేరుమోసిన ల్యాబ్‌కు రోజుకు 400 పరీక్షలు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. సామర్థ్యానికి మించి పరీక్షలు చేయాల్సి రావడంతో ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో శాంపిల్స్‌ తీసుకున్న మరుసటిరోజే రిపోర్ట్స్‌ ఇవ్వాల్సి ఉండగా.. ఒకరోజు ఆలస్యంగా ఇస్తున్నట్లు సమాచారం.  

అ‘ధన’పు బాదుడు.. 
కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకునే వాళ్లపై ప్రైవేటు ల్యాబ్‌లు అదనపు భారాన్ని మోపుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించినట్లుగా పరీక్ష చేసేందుకు రూ.2,200 తీసుకోవాలి. శాంపిల్‌ను ఇంటి నుంచి సేకరించాల్సి వస్తే రూ.2,800 చొప్పున ఫీజు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారు. శాంపిల్‌ సేకరించే టెక్నీషియన్‌ పీపీఈ కిట్‌తో పాటు రక్షణ పరికరాల కోసం ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ల్యాబ్‌ యాజమాన్యాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఇటు కొందరు ల్యాబ్‌కు వచ్చి శాంపిల్‌ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంటికి వచ్చి శాంపిల్‌ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ల్యాబ్‌లో పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటంతో ఇంటికి వెళ్లి శాంపిల్‌ తీసుకోవడం సాధ్యం కాదని బంజారాహిల్స్‌లోని ఓ ల్యాబ్‌ యజమాని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement