కార్మికులకు పదో వేజ్‌బోర్డ్‌ ఏరియర్స్‌

Ten Wage Board Aerials For Workers - Sakshi

సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్‌సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్‌ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్‌ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్‌ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది.

అయితే కోల్‌ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్‌ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్‌ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top