breaking news
Wage board committee
-
కార్మికులకు పదో వేజ్‌బోర్డ్ ఏరియర్స్
సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది. అయితే కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది. -
సింగరేణి సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు
► సన్నద్ధమవుతున్న జాతీయ కార్మిక సంఘాలు ► కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసే పనిలో నాయకులు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు 10వ వేజ్‌బోర్డు కమిటీని సత్వరమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సం ఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగం గా ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన సంఘాలు తిరిగి 13న శ్రీరాంపూర్‌లో సమావేశం కావడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందు కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 10వ వేతన ఒప్పందం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. ఇందుకు జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) కమిటీ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాలేదు. జేబీసీసీఐ కమిటీని కోలిండియా లిమిటెడ్(సీఐఎల్) సంస్థ ఏర్పాటు చేయాలా? లేక కేంద్ర బొగ్గు శాఖ ఏర్పాటు చేయాలా ? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా కోలిండియా సంస్థ కమిటీ ఏర్పాటు చేస్తే సింగరేణి ని మినహాయించి తన పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలతో కమిటీ వేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం సింగరేణిలో ఉన్న జాతీయ సంఘాలను ఆందోళనకు గురిచేసింది. దీంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను స్వయంగా కలిసి విన్నవించాలనే నిర్ణయానికి జాతీయ సం ఘాలు వచ్చాయి. ఈనెల 15న కేంద్ర మంత్రి వస్తారనే సమాచారం మేరకు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి మరో జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ హాజరు కాలేదు. ఈ సంఘం విడిగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ బొగ్గు శాఖ మంత్రిని కలిపించాలని కోరుతూ గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హంసరాజ్ గంగారామ్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు. సీఎండీని కలువనున్న సంఘాలు సింగరేణిలో నెలకొన్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, సకల జనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు, సొంతిం టి పథకం, డిస్మిస్డ్ కార్మికులు, వీఆర్ఎస్ వారసులకు ఉద్యోగావకాశం తదితర సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను కలిసి విన్నవించేందుకు జాతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే జూన్ 7న హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి హెచ్ఎంఎస్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు హాజరు కానందున వారిని మరోసారి ఆహ్వానిస్తూ ఈనెల 13న శ్రీరాంపూర్‌లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వైపు కోలిండియా నుంచి సింగరే ణిని తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం లేఖలు రాసిందని, ఇందుకు గుర్తింపు సంఘానిదే బాధ్యత అంటూ ప్రచారం చేసిన జాతీయ కార్మిక సంఘాలు తిరిగి ఉమ్మడి ఆందోళనలపై నిర్ణయం తీసుకునే సమావేశాలకు టీబీజీకేఎస్‌ను ఆహ్వానించారు. దీనిపై ఆ యూనియన్ ఆచి తూచి అడుగులు వేస్తుస్తోంది.