తాగునీటికి ఇబ్బందుల్లేవ్‌!

Telangana State Have Sufficient Water In Reservoirs - Sakshi

యాసంగి ముగిశాక సైతం జూన్‌ వర్షాల వరకు సరిపడేంత నిల్వలు

నాగార్జునసాగర్‌ కింద రాష్ట్ర అవసరాలకు 52 టీఎంసీల లభ్యత

అవసరమైతే శ్రీశైలంలో 800 అడుగుల వరకు తీసుకోవచ్చు

ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కడెం, ఎల్లంపల్లిలో కావాల్సినన్ని నీళ్లు

చుక్కనీరు లేని సింగూరు, నిజాంసాగర్‌ కిందే అయోమయం 

రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో తాగునీటి కష్టాలు లేనట్టే. సింగూరు, నిజాంసాగర్‌ మినహా మిగతా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో తాగునీటికి కటకట తప్పనుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే బ్యారేజీలు, రిజర్వాయర్‌లు అన్నీ నింపి ఉంచడం, వీటినుంచి చెరువులు సైతం నింపడంతో జూన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పుష్కలంగా నీరు... 
రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో భారీ సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ఆయకట్టుకోసం 192 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ఇందులో గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి 91, కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి 101 టీఎంసీల వినియోగం జరిగింది. గోదావరి బేసిన్‌లో జరిగిన వినియోగంలో అధికంగా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీరే 50 టీఎంసీల మేర ఉంది. అయితే ప్రస్తుతం యాసంగి పంటలకు నీటి విడుదల అన్ని ప్రాజెక్టుల పరిధిలో ముగిసింది. సాగు అవసరాలకు నీటి విడుదల ముగిసిన అనంతరం  అన్ని ప్రాజెక్టుల కింద తాగునీటికి అవసరమైనంత నీటిని నిల్వ చేసి ఉంచారు.

ముఖ్యంగా నాగార్జునసాగర్‌ పరిధిలో ప్రస్తుతం 194.21 టీఎంసీల నిల్వ ఉన్నప్పటికీ ఇందులో 510 అడుగుల కనీస నీటి మట్టాలకు ఎగువన 63 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, తెలంగాణ వాటా కింద 52 టీఎంసీలను వాడుకునేందుకు హక్కు ఉంది. దీంతో పూర్వ నల్లగొండ, ఖమ్మం జిల్లా అవసరాలకు ఢోకా లేదు. ఇక శ్రీశైలంలో 807 అడుగుల వరకు నీటిని తీసుకుంటూ, కల్వకుర్తి తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు కేటాయించగా, అవసరమైతే 800 అడుగుల వరకు నీటిని తీసుకోనున్నారు. గతంలో చాలాసార్లు 800 అడుగుల వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే ఈ నీటిని జూలై వరదలు కొనసాగే వరకు పొదుపుగా వాడుకోవాల్సి ఉంది.

ఇక గోదావరిలోని ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో సుమారు 70 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇది గత ఏడాది నిల్వలకన్నా ఏకంగా 50 టీఎంసీల మేర అధికం. ఇక నిజాంసాగర్, సింగూరులో మాత్రం చుక్క నీరు లేదు. ఇక్కడ జూలై వర కు కనీసంగా 3 నుంచి 4 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయి. ఈ నీటికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 వేలకు పైగా చెరువుల్లో సగానికి పైగా చెరువుల్లో యాభై శాతంకన్నా అధిక నీటి నిల్వ ఉంది. ఈ నీరు గ్రామాల్లోని పశువుల తాగునీటి అవసరాలను తీర్చనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top