ఆర్టీఏ..ఈజీయే! | Telangana RTA Launches Online Services | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ..ఈజీయే!

Aug 1 2019 2:28 AM | Updated on Aug 1 2019 2:28 AM

Telangana RTA Launches Online Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖ అందించే వివిధ రకాల పౌరసేవల్లో  పెనుమార్పులు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దాదాపు 37 రకాల సేవలను మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని.. ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అనుమతి వస్తే.. వెంటనే అమలే.. ఇంతకీ ఏంటా మార్పు.. వివరాలు ఇవిగో..  

ఇప్పటివరకు..
అన్ని రకాల పౌర సేవల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ (సమయం, తేదీ) నమోదు చేసుకొని.. ఆన్‌లైన్‌లోనే  ఫీజులు చెల్లించిన తరువాత నిర్దేశిత సమయం మేరకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వస్తుంది. సంబంధిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల కోసం అటూ ఇటూ తిరగడాలు.. మధ్యవర్తులు, దళారుల హడావుడి.. చేతికి చమురు వదలడాలు ఇవన్నీ మామూలే.. 

ఇకపై..
ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. దళారుల బెడద ఉండదు. పాత డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్, అలాగే అవసరమైన అన్ని రకాల పౌరసేవల్లో.. చిరునామాలో మార్పులు, చేర్పులు.. వాహనాల రిజిస్ట్రేషన్‌లు, పర్మిట్లను ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వాహనాలకు నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌), ఒకరి నుంచి మరొకరికి వాహన యాజమాన్యం బదిలీ, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్లు, లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు పొడిగింపు, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, డూప్లికేట్‌ ఆర్సీ, త్రైమాసిక పన్ను, గ్రీన్‌ ట్యాక్స్‌ వంటి వివిధ రకాల పన్ను చెల్లింపులు, హైర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్, హైర్‌ పర్చేస్‌ టర్మినేషన్‌ వంటి సుమారు 37 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.  

ప్రస్తుతం వీటి కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకొని ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కావలసిన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేసి, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.ఆర్టీఏ అధికారులు  తమకు అందిన దరఖాస్తులు, డాక్యుమెంట్‌లను పరిశీలించిన అనంతరం  వినియోగదారులు కోరుకున్న సేవలను ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరోవైపు ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయం లభిస్తుంది.దీంతో ఎలాంటి జాప్యానికి  తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు.  

ఇవి మాత్రం ఎప్పటిలాగే..
ఆర్టీఏ అధికారులు స్వయంగా పరీక్షించి అందజేసే లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.లెర్నింగ్‌ లైసెన్సు కోసం ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని ఫీజు చెల్లించి వెళితే  పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇది తీసుకున్న తరువాత నెల నుంచి  6 నెలలోపు మరోసారి  డ్రైవింగ్‌ లైసెన్సు కోసం  స్లాట్‌ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి. లారీలు, బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల, సరుకుల రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అందజేసే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement