అమరుల శవాల మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అంగట్లో అమ్మకానికి పెట్టిందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ ఆరోపించారు.
ఇందూరు (నిజామాబాద్) : అమరుల శవాల మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అంగట్లో అమ్మకానికి పెట్టిందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు తెలంగాణనే దోచుకుంటోందన్నారు. 60 ఏండ్ల కోస్తాంధ్ర, రాయలసీమ పాలనను ప్రక్షాళన చేసి దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చు దిద్దుతామని చెప్పిన టీఆర్‌ఎస్ మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు.
టీఆర్‌ఎస్ ఏడాది పాలనలో ఏం చేసింది, ఎవరిని వంచించింది, ప్రజలను ఎంతగా మోసం చేసిందో వివరించడానికి టీపీఎఫ్ సిద్ధమైందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమార్కులకు, కబ్జాదారులకు, మాఫియాకు అండగా నిలిచి టీఆర్‌ఎస్ తెలంగాణను ఎలా దోచుకుంటుందో ప్రజలకు తెలిసే విధంగా సభను నిర్వహిస్తామని చెప్పారు. బహిరంగసభకు టీపీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.