
పింఛన్ల పంపిణీ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా ఖాళీగా కనిపించిన కుర్చీలు
ఎమ్మెల్యేలు తప్పు చేసినా నిలదీయొచ్చు.. ప్రజలకు ఆ మేరకు స్వేచ్ఛను ఇచ్చాం
అవయవాలు సక్రమంగా ఉన్నవారికి పింఛన్లు
పింఛన్ భరోసా, రజకులతో మాటామంతి, ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన ప్రజలు
మంత్రులకు భంగపాటు.. సీఎం కార్యక్రమాల్లో కనిపించని వైనం
సీఎంవో డైరెక్షన్... అనుమతి లేకపోవడంతో వాహనంలోనే నిరీక్షణ
సాక్షి, అమరావతి సాక్షి, రాయచోటి: ‘‘తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మీలో రావాలి. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఎమ్మెల్యేలైనా సరే తప్పు చేశారని భావిస్తే నిలదీయండి’’ అని సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి సంక్షేమం అందిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి... సరిగ్గా 30 ఏళ్ల క్రితం తాను తొలిసారి సీఎంగా ప్రమాణం చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సోమవారం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
అంతకుముందు ములక్కాయలపల్లెలో వృద్ధురాలికి పింఛన్ పంపిణీ, బోయినపల్లిలో ధోబీఘాట్‌ను సందర్శించి రజకులతో మాట్లాడారు. తర్వాత రాజంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 30 ఏళ్లలో ఏనాడూ తాను విశ్రమించలేదన్నారు. నిద్రలేచింది మొదలు మిషన్ తరహాలో పనిచేస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో రక్తం పారిందని, నేడు నీళ్లు పారిస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ప్రజా వేదికపై సీఎం ప్రసంగం జనంలో విసుగుతెప్పించింది. తన గురించి గొప్పలు పోవడం ప్రజల సహనానికి పరీక్ష పెట్టింది. దీంతో చాలామంది వెనుదిరిగారు. వలంటీర్లు చెబుతున్నా పట్టించుకోలేదు. ఖాళీ కుర్చీలు కనిపించాయి.
గతాన్ని గుర్తుపెట్టుకోవాలి
గతాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలని, ఆ స్ఫూర్తితో భవిష్యత్‌కు ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలని, నేటి అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా చంద్రబాబును
సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం పలువురు అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలనా అంశాలు, ప్రజా సేవల విషయంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సీఎం చంద్రబాబు తన అనుభవాలు పంచుకున్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ విధానం తెచ్చింది నేనే..
విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని సీఎం చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరవుండేదని, దీంతో నాడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తొలిసారి ఈ విధానాన్ని తెచ్చింది తానేనన్నారు.
అవ్వను వెళ్లగొట్టేశారు..
తన మనుమరాలికి పింఛన్ రాకపోవడంతో సీఎంకు మొరపెట్టుకునేందుకు వచ్చిన అమ్మమ్మ
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో మానసిక వికలాంగురాలైన తన మనుమరాలికి పింఛన్ ఇప్పించుకుందామని వచ్చిన అవ్వను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 23 ఏళ్ల ఆశా భాను పుట్టుకతో మానసిక వికలాంగురాలు. అయినా ఆమెకు పింఛన్ రావడం లేదు.
సోమవారం రాజంపేట మండలం ములక్కాయపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబుకు విన్నవిస్తే న్యాయం జరుగుతుందని ఆ మానసిక వికలాంగురాలి అమ్మమ్మ ఆశపడింది. చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే ఇంటి వద్దకు వెళ్లింది. అయితే పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పసిబిడ్డలా ఉన్న తన మనవరాలి చేతులపై మోసుకుంటూ రోదిస్తూ వెనుదిరిగి వెళ్లడం చూపరులను కలచివేచింది.