అది నకిలీ మద్యమే! | Lab tests confirm that all samples contain fake alcohol | Sakshi
Sakshi News home page

అది నకిలీ మద్యమే!

Oct 18 2025 4:38 AM | Updated on Oct 18 2025 4:38 AM

Lab tests confirm that all samples contain fake alcohol

ల్యాబ్‌ పరీక్షల సాక్షిగా బట్టబయలు

గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారణ 

నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో నకిలీ మద్యం 

45 మద్యం శాంపిల్స్‌ పంపిన ఎక్సైజ్‌ అధికారులు 

అన్ని శాంపిల్స్‌లోనూ నకిలీ మద్యమేనని స్పష్టీకరణ 

అండర్‌ ప్రూఫ్, ఓవర్‌ ప్రూఫ్‌లో భారీ వ్యత్యాసం 

ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని వెల్లడి 

ల్యాబ్‌ రిపోర్ట్‌ తీవ్రత తగ్గించి చూపేందుకు మల్లగుల్లాలు 

ఆ మద్యం ప్రమాదకరం కాదంటూ ఎల్లో మీడియా వత్తాసు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ : నకిలీ మద్యం తయారీ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన­రావు నిర్వహిస్తున్న డంప్‌ వద్ద స్వాధీనం చేసుకున్నది ముమ్మూటికీ నకిలీ మద్యమేనని స్పష్టమైంది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో ఈ నకిలీ మద్యం తయారైందని వెల్లడైంది. ఈ మేరకు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాల నిర్ధారించిందని విశ్వసనీయంగా తెలిసింది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హానికర రసాయనా­లతో నకిలీ మద్యం తయారు చేశారని నివేదిక స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్ర­హీం­పట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూ­నాలను ఎక్సైజ్‌ అధికారులు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగ­శాలకు పంపారు. నకిలీ మద్యం తయారీకి ఉపయో­గించిన ముడి సరుకు, రసాయ­నాలు, స్పిరిట్‌తో పాటు తయారైన మద్యంను అధికారులు సీజ్‌ చేసి, ఈ మొత్తం సరుకుకు సంబంధించి 45 నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలి­సింది.ఈ నమూనాలను పరీక్షించిన అనంతరం అదంతా నకిలీ మద్యమేనని తేల్చినట్లు సమాచారం. 

ఈ మేరకు నివేదిక ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే చేరింది. ఈ నివేదికలో పేర్కొన అంశాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికా­రులతో కలిసి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచా­రం. అండర్‌ ప్రూఫ్, ఓవర్‌ ప్రూఫ్‌లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలినప్పటికీ.. అదేమంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్లో మీడియా ఆ ప్రచారాన్ని భుజానికెత్తుకుంది.  

కొంచెం నాణ్యత లేని మద్యమట!
నకిలీ మద్యం పలు వైన్‌ షాపులతోపాటు, బెల్ట్‌ షాపులకు సరఫరా కావడం, కొన్ని బార్లలో కూడా విక్రయించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాదిన్న­రగా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నామని నిందితులు చెప్పడంతో ఇన్నాళ్లూ తాము ఎలాంటి మద్యం తాగామనే ఆందోళన మొదలైంది. ఇది తప్పకుండా తమ అరోగ్యాలపై ప్రభావం చూపుతుందని అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాని తీవ్రతను తగ్గించి చూపేందుకు నానా తంటాలు పడుతోంది. 

ఇది నకిలీ మద్యం కాదని, కొంచెం నాణ్యత లేని మద్యం మాత్రమే అని  చెప్పుకొస్తోంది. దీని వల్ల ప్రమాదం ఏమిలేదని చెప్పేందుకు ఆపసోపాలు పడుతోంది. అయితే నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు  లేకుండా, కెమిస్ట్‌ల పర్యవేక్షణ లేకుండా తయారు చేసిన సరుకు వాడితే ప్రమాదం లేకుండా ఎలా ఉంటుందని వైద్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  మందులో స్ట్రెంత్‌ లేకుండా నీళ్లు కలిపి.. అధిక ధరలకు అమ్మటం ప్రజలను మోసం చేయటం కాదా.. అని పలువురు మద్యం ప్రియులు నిలదీస్తున్నారు. 

ఒక సరుకు పేరు చెప్పి, ఇంకొక సరుకు అమ్మితే అది నేరం కాకుండా పోతోందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం తయారు చేయటం అనేదే నేరం అనే విషయాన్ని పక్కన పెట్టి, అది అంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని చెప్పడంపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాలేదని వాపోతున్నారు.  

ప్రజల ప్రాణాలతో చెలగాటం
మద్యంలో యూపీ (అండర్‌ ప్రూఫ్‌) 25గా ఉండాలి. ఓపీ (ఓవర్‌ ఫ్రూఫ్‌) 75గా ఉండాలి. అయితే ఇబ్రహీంపట్నంలో సీజ్‌ చేసిన మద్యంలో యూపీ సగానికి సగం ఎక్కువగా ఉందని, ఓపీ ఉండాల్సిన దానికంటే బాగా తక్కువగా ఉందని ల్యాబ్‌ రిపోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే రంగు నీళ్లలో స్పిరిట్‌ కలిపి నకిలీ మద్యం తయారు చేశారని తెలుస్తోంది. 

ప్రభుత్వ అనుమతి పొందిన డిస్టిలరీల్లో నిబంధనల మేరకు మద్యం తయారైన తర్వాత ఆ నమూనాలను ఎక్సైజ్‌ శాఖ ప్రయోగశాలకు పంపి, ఓకే చేసిన తర్వాతే సీసాల్లో నింపుతారు. అయితే ఇటీవల పట్టుబడిన మద్యం.. నాణ్యత, గాఢత ప్రమాణాలు పాటించకుండా తయారైనట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ పెద్దల భరోసాతో నిర్దేశించిన ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా నకిలీ మద్యం తయారు చేసి వైన్‌ షాపులకు, బెల్ట్‌ షాపులకు సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement