బెల్ట్‌ షాపుల్లో నకిలీ కిక్కు! | Fake liquor in belt shops of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపుల్లో నకిలీ కిక్కు!

Oct 13 2025 5:25 AM | Updated on Oct 13 2025 5:25 AM

Fake liquor in belt shops of Andhra Pradesh

రాష్ట్రవ్యాప్తంగా 75 వేలకుపైగానే..

రూ.లక్ష మొదలు రూ.9 లక్షల వరకు వేలంపాటలు

నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం 

ఆ మేరకు ముందస్తు సమాచారంతోనే పోటీపడి వేలం  

ఇప్పుడు ఆ గుట్టు రట్టవ్వడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు 

కేసును నీరు గార్చేందుకు రంగంలోకి దిగిన పెద్దలు 

ఇప్పటిదాకా ఆ మద్యం తాగిన వారంతా బెంబేలు

కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్‌ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో.. ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో బెల్ట్‌షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే.    

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్‌షాపు రూ.9 లక్షలు పలికింది. అదే జిల్లా చల్లపల్లి మండలం మాజేరులో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. కృష్ణాజిల్లాలో 1,589 బెల్ట్‌ షాపులు, ఎన్టీఆర్‌ జిల్లాలో 1,135 ఉన్నాయి. అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక  గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ బెల్ట్‌ షాపులు పెట్టి నకిలీ మద్యం భారీగా అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్‌ విస్తరించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీం పట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్‌ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్‌ షాపులు ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటిని టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకొన్నారు. 

అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12 పైగా బెల్ట్‌ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. 

అదే జిల్లా నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్‌ షాపు రూ.9 లక్షలు పలికింది. కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్‌ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతోపాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో... ఎలా వస్తాయో.. సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ మద్యం అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో బెల్ట్‌షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే.  

టీడీపీ నాయకుల్లో అలజడి 
ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌ షాపులు ఊరూరా పుట్టగొడుగుల్లా వెలిశాయి. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యం అమ్మకాలే ఈ బెల్ట్‌ షాపుల్లో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ మద్యం తాగిన పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నకిలీ మద్యం గుట్టు రట్టు కావడంతో, ఈ మద్యం తాగినవారు బెంబేలెత్తుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఎక్కువగా నకీలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు తనిఖీల్లో వెలుగు చూసిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. 

పేదలు ఎక్కువగా తాగే రూ.99, రూ.130 లాంటి రకాల నకిలీ మద్యం తయారీపైనే సిండికేట్‌ దృష్టి సారించినట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో తేలింది. మరోవైపు విజయవాడ కేంద్రంగా కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగిందని పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్‌ జిల్లాలో 1,135, కృష్ణా జిల్లాలో 1,589 బెల్ట్‌ షాపులు ఉన్నాయి. అంటే గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో ఇట్టే తెలిసిపోతోంది. ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఇన్ని బెల్ట్‌ షాపులు ఎలా పుట్టుకొచ్చాయని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెల్ట్‌ షాపులకు ప్రభుత్వమే తలుపులు బార్లా తెరిచిందని చెబుతున్నారు. 

సాక్షాత్తూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే, మిగతా జిల్లాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ట్‌ షాపులను అధికారులు తనిఖీ చేసిన పాపాన పోవటం లేదు. కరకట్ట బంగ్లా మొదలు టీడీపీ పార్లమెంటు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు వారి స్థాయిని బట్టి ముడుపులు ముట్టడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి, నకిలీ మద్యం అంటగట్టారని మందు తాగే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో నకిలీ మద్యం తయారీ వెనుక పార్లమెంట్, మైలవరం నియోజకవర్గ ప్రజాప్రతిధుల పాత్ర ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

కింది నుంచి పైదాకా అందరికీ వాటాలు
ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే సాగినట్లు జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడకు కూతవేటు దూరంలో ఇంత పెద్ద నకిలీ మద్యం డంపు నడిచిందంటే, టీడీపీ ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఈ వ్యవహారం జరగదనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 

⇒ మైలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, అతని బావమరిదికి తెలియకుండా చీమ కూడా చిటుక్కు మనదని చెబుతున్నారు. ఇసుక, మట్టి, బూడిద, మద్యం వ్యాపారం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందని.. అలాంటప్పుడు ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం వీరి అండ లేకుండా జనార్దన్‌రావు ఒక్కడే చేయటం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంటు ప్రజాప్రతినిధికి కూడా వాటాలు లేకుండా వ్యాపారం చేయలేరని స్ధానికులు చెబుతున్నారు.  

⇒ వీరితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్న పలువురు టీడీపీ నేతల హస్తం కూడా ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పలు మద్యం షాపుల వద్ద మాన్యువల్‌గా పేపరు మీద రాసుకున్న స్టాకు వివరాల లెక్కలు ఒకసారి పరిశీలిస్తే రోజుకు ఎంత నకిలీ మద్యం అమ్మింది తేలనుంది. మద్యం డిపో నుంచి తెచి్చన సరుకును బార్లకు తరలించి, పలుచోట్ల నకిలీ మద్యమే షాపుల్లో విక్రయించారని పలువురు స్పష్టం చేస్తున్నారు.  

⇒ కాగా, పట్టుబడిన నకిలీ మద్యంకు సంబంధించిన కేసు విచారణ ముఖ్యనేత డైరెక్షన్‌లో సాగుతుండటం గమనార్హం. ఈ వ్యవహారంలో ముఖ్య నేతలకు వాటాలు ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసక బారడంతో కేసు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇందుకు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతుండటం దుర్మార్గం.

గుట్టు రట్టుతో గుభేల్‌.. 
నకిలీ మద్యం గుట్టు రట్టు కావడం.. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. అద్దేపల్లె జనార్దనరావుతో పాటు ఆయన సోదరుడు, మరి కొందరు మాత్రమే నకిలీ మద్యం తయా­రీదారులుగా చూపించి సూత్రధారులు సురక్షితంగా బయట పడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కరకట్ట బంగ్లా పాత్రను కప్పిపుచ్చే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అద్దేపల్లె జనార్దనరావు లొంగుబాటు ఓ పథకం ప్రకారమే జరిగినట్లు ఎక్సైజ్‌ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement