కదల్లేని విధంగా కొడతారా? | High Court expressed anger over the conduct of the police in the state | Sakshi
Sakshi News home page

కదల్లేని విధంగా కొడతారా?

Oct 18 2025 4:30 AM | Updated on Oct 18 2025 9:09 AM

High Court expressed anger over the conduct of the police in the state

రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు

పౌరులను స్టేషన్‌కు పిలిపించడం.. నిర్బంధం.. చితకబాదడం పరిపాటైపోయింది 

ఇప్పటికీ పిటిషనర్‌ కదల్లేని స్థితిలో ఉన్నారు 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటైపోయింది 

పోలీసులపై ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరా? 

మీకు మీరే.. తప్పుడు కేసు అని పక్కన పెట్టేస్తారా?.. సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయరా? 

అది పిటిషనర్‌ హక్కులను హరించడమేనని కన్నెర్ర.

కోర్టులో స్వయంగా హాజరైన కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌  

పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?

ఇటీవల మంగళగిరి సీఐ.. హైకోర్టు డ్రైవర్‌ను కొట్టారు. దీనిపై డ్రైవర్‌ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే, ఆ తర్వాత సీఐని వీఆర్‌కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని హెచ్చరించింది. పౌరులను పోలీసుస్టేషన్‌కు పిలిపించడం.. అక్రమంగా నిర్బంధించడం.. చితకబాదడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో పోలీసులు పిటిషనర్‌ను కొడితే ఎనిమిదేళ్లుగా ఇప్పటికీ ఆయన కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా­రని, ఇది దారుణమని హైకోర్టు మండిపడింది. 

అసలు నిర్బంధించడం... కొట్టడం.. ఏమిటంటూ నిలదీసింది. పిటిషనర్‌ను కోర్టుకు పిలిపించి స్వయంగా వాస్తవాలు తెలుసుకోవాలని భావించినా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నందున ఆ దిశగా ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని, పిటిషనర్‌ చేసింది ఎలాంటి నేరమైనా ఎనిమిదేళ్లుగా కదల్లేని విధంగా కొడతారా? చట్టాన్ని అనుసరించరా? అంటూ పోలీసుల తీరు­పై కన్నెర్ర చేసింది. 

తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిటి­షనర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు సీసీఎస్‌ పోలీ­సులపై నమోదు చేసిన కేసును తప్పుడు కేసు అంటూ మూసివే­యడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కేసును మూసివేయాలంటూ సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. కోర్టు అనుమతి లేకుండా కేసును ఎలా మూసివేస్తా­రని నిలదీసింది. కేసును మూసివేసిన సంగతి కనీసం ఫిర్యాదు­దారుడైన  పిటి­ష­నర్‌కు కూడా చెప్పకపోవడం ఏమిటంటూ మండిపడింది. ఇలా చేయడం ద్వారా పిటిషనర్‌ హక్కులను హరించా­రంటూ పోలీసు­లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కేసును మూసివే­స్తున్నట్లు చట్ట ప్ర­కారం కోర్టు ముందు తుది నివేదిక దాఖలు చేసి ఉంటే ఫిర్యాదు­దారుడికి నోటీసు అందేనని, తద్వారా కేసు మూసి­వేతపై నిరసన పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉండేదని పేర్కొంది.  ఫిర్యాదుదారుడికి పోలీ­సులు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందంది. పోలీసుల తీరు ఆమోదయోగ్యం కాదని, ఇటీవల కాలంలో చట్టాన్ని చేతు­ల్లోకి తీసుకోవడం వారికి  అలవాటుగా మారిపో­యిందని వ్యాఖ్యా­నించింది. 

‘‘ఇటీవల మంగళగిరి సీఐ హైకోర్టు డ్రైవర్‌ను కొట్టారు. దీనిపై డ్రైవర్‌ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తరువాతే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తరువాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలి­పిస్తే.. ఆ తరువాత సదరు సీఐని వీఆర్‌కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ హైకోర్టు నిలదీసింది.

కేసు మూసివేత విషయంలో కోర్టులో దాఖలు చేసిన తుది నివేది­కను పిటిషనర్‌కివ్వాలని పోలీసు­లను ఆదేశించింది. ఎనిమిదేళ్లుగా కేసును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టా­రని, తదుపరి విచారణలో ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతా­మంది. అసాధారణ జాప్యాన్ని తాము విస్మరించలేమని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్‌పీ విక్రాంత్‌ పాటిల్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరు కాగా తదుపరి విచారణకు మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తప్పుడు కేసుగా మూసివేసిన పోలీసులు
కర్నూలు సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌) ఎస్‌హెచ్‌వో తనను అక్రమంగా నిర్బంధించి, అకారణంగా  కస్టడీలో వేధిస్తున్నారని, దీని­పై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన గొల్లా జయపాల్‌ యా­దవ్‌ 2016లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయ­మూర్తి జస్టిస్‌ దేవానంద్‌ ఇటీవల తుది విచారణ చేపట్టారు. పిటిషనర్‌ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్‌ పోలీసులపై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ పరిశీలించారు. 

కర్నూలు టూ టౌన్‌ ఎస్‌ఐ ఇచ్చి­న నివేదికను ఆమోదిస్తూ డీఎస్‌పీ 2018లో ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దేని ఆధారంగా ఆ ఫిర్యా­దును తప్పుడు ఫిర్యాదుగా తేల్చారో అందుకు ఆధారాలేవీ రికార్డుల్లో లేని విషయాన్ని న్యాయమూర్తి గమనించారు. తప్పుడు ఫిర్యాదు అన్న విషయాన్ని సంబంధిత మేజి్రస్టేట్‌కు తెలియ చేశారా? లేదా? అనే విషయం రికార్డుల్లో స్పష్టంగా లేదు.   

ఇప్పటికీ నడవలేకపోతున్నారు
పిటిషనర్‌ జయపాల్‌ యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్‌ను తీవ్రంగా కొట్టారని, దీంతో అప్పటి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని ఇలా కూడా కొడతారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత విచారణ సమయంలో కోర్టు తీవ్రంగా స్పందించిన తరువాతే పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని రఘునాథ్‌ నివేదించారు. 

ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి స్పందిస్తూ తుది నివేదికకు సంబంధించి పిటిషనర్‌కు నోటీసు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు ఒక్కటే ఇస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక కాపీని కూడా పిటిషనర్‌కు ఇవ్వాలని, అప్పుడు దానిపై తగిన విధంగా స్పందించేందుకు అతడికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement