
కోర్టులన్నా.. కోర్టు ఆదేశాలన్నా అంత నిర్లక్ష్యమా?
పోలీసుల తీరుపై హైకోర్టు మండిపాటు
అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు?
తీరికున్నప్పుడు కౌంటర్ వేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?
ప్రజలకు మాపై నమ్మకం పోయే పరిస్థితిని రానివ్వం
8 ఏళ్లుగా కేసును పక్కన పడేసి.. ఇప్పుడు అనుమతి కోరతారా?
సాక్షి, అమరావతి: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ 2017లో పిటిషన్ దాఖలైతే.. ఏళ్లు తరబడిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఏమిటీ నిర్లక్ష్యమంటూ మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారంటూ పోలీసులను నిలదీసింది. తీరిగ్గా మీకు కావాల్సినప్పుడు కౌంటర్ దాఖలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటారా? అని నిలదీసింది. ఇలాగే వదిలిస్తే.. పదేళ్ల తరువాత కూడా కౌంటర్ దాఖలు చేసినా ఏమీ కాదనే ధోరణితో అధికారులు ఉంటారని, దీనివల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకంపోతుందని వ్యాఖ్యానించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితిని రానివ్వబోమని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లుగా కౌంటర్ దాఖలు చేయకుండా చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు అందుకు అనుమతి కోరడాన్ని తప్పుబట్టింది. ఈ అసాధారణ జాప్యానికి రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని, అప్పుడు మాత్రమే కౌంటర్ దాఖలుకు అనుమతినిస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ పి.నాగేంద్ర ప్రసాద్‌కు స్పష్టం చేసింది.
ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయవాదుల క్లర్కుల సంఘానికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టుకు సరైన వివరాలు వెల్లడించనందుకు సుమోటోగా చేపట్టిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నాగేంద్ర ప్రసాద్‌కు నోటీసులు జారీ చేస్తూ దీనిపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు...
కొందరు వ్యక్తులతో తమకున్న సివిల్ వివాదాలపై పోలీసులు జోక్యం చేసుకోవడంపై అనంతపురం జిల్లా ధర్మవరం వాసి ఏ.రాజశేఖర్ 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయలేదు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సమయంలో ధర్మవరం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు.
లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు పిటిషనర్ రాజశేఖర్‌పై కేసు నమోదు చేశామని 2017లో పేర్కొన్న పోలీసులు ఇటీవల అందుకు విరుద్ధంగా చెప్పారు. అసలు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడంపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా స్పందించారు. ఇలా పరస్పర విరుద్ధ వివరాలను కోర్టు ముందుంచినందుకు నాగేంద్ర ప్రసాద్‌పై న్యాయమూర్తి సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టారు.

పోలీసులకు స్పష్టమైన సందేశం ఇవ్వదలిచాం
తాజాగా ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ప్రతి దశలోనూ కనిపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో కోర్టుల పట్ల పోలీసులు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందువల్లే పోలీసుల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, తద్వారా వారికి స్పష్టమైన సందేశం పంపదలిచామన్నారు. కోర్టు ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత పోలీసులు కౌంటర్ దాఖలు చేసి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. రిట్ రూల్స్ ప్రకారం 180 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలన్నారు.