చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు! | Chandrababu Naidu Raa Kadalira Public Meeting Utter Flop In Kurnool District - Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!

Published Mon, Jan 29 2024 6:26 AM

chandrababu public meeting utter flop in Kurnool District - Sakshi

కర్నూలు(సెంట్రల్‌)/నెల్లూరు, సాక్షి ప్రతినిధి/ నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్‌ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. 

జగన్‌ అర్జునుడు కాదు : చంద్రబాబు 
పత్తికొండ, నెల్లూరు సభల్లో చంద్రబాబు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆయన అభిమన్యుడు కాదు.. అర్జునుడూ కాదూ.. భస్మాసురుడు’ అని విమర్శించారు. సాక్షి పత్రికలో అబద్ధాలే రాస్తారని, చదవొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఐటీకి తానే ఆద్యుడినని, తనకు 80 దేశాల్లో మద్దతు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రసన్నకుమార్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

సీఎం వైఎస్‌జగన్‌ చెబుతున్నట్లు 175 సీట్లు వారు గెలవలేరని, పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. జగన్‌ టిక్కెట్లు ఇచ్చిన వారిలో రౌడీలు, దోపిడీ దారులే అధికంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ను ఓడించేందుకు ఏపీలోని 5 కోట్లమంది స్టార్‌ క్యాంపెయి­నర్లు కలసి తనతో రావాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేక ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్‌ నాపై ఎన్ని కేసులుపెట్టి వేధించారో ప్రజలు చూశారన్నారు. సీఎం జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.  

జనసేన కార్యకర్తలపై సోమిరెడ్డి మండిపాటు
నెల్లూరు సభలో జనసేన కార్యకర్తలు వారి పార్టీ జెండాలను ఊపుతుండగా, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెండాలు అడ్డుగా ఉన్నాయని, పక్కకు వెళ్లాలని సూచించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు వినలేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి సూచించినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైక్‌ తీసుకుని జనసేన కార్యకర్తలపై మండిపడ్డారు.

మీరు ఎవరు చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 31న కృష్ణపట్నం పోర్టులో ఉన్న కంటైనర్‌ టెర్మినల్‌ తమిళనాడుకు తరలిపోతుందని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరోక్షంగా దుర్భాషలాడారు.   

డబ్బులు, మద్యం ఎర చూపినా..
నెల్లూరులో డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు చంద్రబాబు సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్‌వీజీఎస్‌ కళా­శాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. వారూ వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నాయకులకు టెంట్, కూలింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపో­వడంతో మండుటెండలో వారు విలవిలలా­డారు. ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది.

సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250, క్వార్టర్‌ మద్యం బాటిల్‌ పంపిణీ చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను మాట్లాడే సమయానికి ప్రజలను నిలబెట్ట­లేకపోయారా అని నెల్లూరు నగర రూరల్‌ ఇన్‌చార్జిపై మండిపడ్డారు. పత్తికొండలోని ఆదోని రోడ్డులో జరిగిన సభకు కచ్చితంగా లక్ష మంది వస్తారని శనివారం సాయంత్రం స్థానిక నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తీరా ఆదివారం ప్రజలెవ­రూ రాకపోవడంతో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement