‘పంచాయతీ’కి సై

Telangana Panchayat Elections Arrangement Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలో మూడు విడతలుగా 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి శిక్షణా తరగతులు పూర్తి చేసిన అధికారులు.. ఇక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై దృష్టి సారించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లయింది.

తొలి దశ ఎన్నికలు జనవరి 21వ తేదీన, రెండో దశ 25వ తేదీన, మూడో దశ ఎన్నికలు జనవరి 30వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్‌.. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టతనిచ్చింది. ఈనెల 7న తొలివిడత ఎన్నికలకు సంబంధించి నోటీసు జారీ చేస్తారు. ఆరోజు నుంచి 9వ తేదీ వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 11వ తేదీన ఆయా పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైతే తగిన ఆధారాలతో రెవెన్యూ డివిజనల్‌ అధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 12న ఈ తరహా దరఖాస్తులపై సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. అదేరోజు ఆయా పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. తొలిదశ ఎన్నికలు జిల్లాలోని 188 గ్రామ పంచాయతీలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలింగ్‌ బూత్‌లు, అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బందిని సిద్ధం చేశారు. 21వ తేదీన మొదటి విడత పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. జిల్లాలో మొదటి విడతగా ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి, కూసుమంచి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రెండో విడతలో 204 జీపీలకు.. 
ఇక రెండో విడతలో 204 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 11వ తేదీన జారీ చేయనున్నారు. 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 14వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 15న ఆయా పదవులకు పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైతే దానిపై తగు ఆధారాలతో రెవెన్యూ డివిజనల్‌ అధికారికి అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 16వ తేదీన దీనిపై సంబంధిత అధికారులు నిర్ణయం ప్రకటించే గడువు ఇచ్చారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌.. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడతలో ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది.

మూడో విడతలో 192 జీపీలకు.. 
ఇక మూడో విడత జిల్లాలోని 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రఘునాథపాలెం, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల పరిధిలోని గ్రామ పంచాయత్లీల్లో ఎన్నికలు జనవరి 30న నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రోజే ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. 19వ తేదీన నామినేషన్‌ పరిశీలన చేసి నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నామినేషన్లు అర్హత పొందాయో జాబితాను ప్రదర్శిస్తారు. 20వ తేదీన నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు తమ నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునే గడువుగా విధించారు.

21న సంబంధిత అధికారులు వీటిపై నిర్ణయం ప్రకటించనున్నారు. 22న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడించగానే ఉప సర్పంచ్‌ పదవికి సైతం ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్‌ను గెలుపొందిన వార్డు సభ్యుల్లోని మెజార్టీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు.

పంచాయతీలవారీగా రిజర్వేషన్లు సైతం పూర్తి కావడంతో ఇక పోలింగ్‌ ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేశారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికలకు 4,870 పోలింగ్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు. 5,338 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 5,800 మంది ఉద్యోగులు మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కుతోంది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా.. పార్టీ గుర్తులేవీ ఈ ఎన్నికల్లో ఉండకపోయినా.. గ్రామాల్లో మాత్రం పంచాయతీ రాజకీయం ఊపందుకుంటోంది.     

సర్వం సిద్ధం  
ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 584 గ్రామ  పంచాయతీలకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, విధులు నిర్వహించే ఉద్యోగులకు శిక్షణ పూర్తి చేశాం. బ్యాలెట్‌ బాక్స్‌లను సైతం సిద్ధం చేశాం. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top