దారుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌

Telangana Jana Samithi, Left Parties Protest at Bus Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మాట్లాడితే వాళ్లను బట్టలు చించేలా కొట్టారని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ జనసమితి, సీపీఐ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఉదయం బస్‌భవన్‌ను ముట్టిడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బస్‌భవన్‌ ముందు బైఠాయించి ఆందోళనకారులు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా సంధ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విలీనం చేయకపోగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో విసిగిపోయిన కార్మికులు సమ్మె చేపట్టారని, వీరికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. చర్చల కమిటీని మొదటి రోజే ఎలా రద్దు చేస్తారు? చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు తీసేస్తామంటూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బదీసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం తెగించి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు అన్ని వర్గాలు ముందుకు రావాలని సంధ్య పిలుపునిచ్చారు.

కేసీఆర్‌.. ‘సెల్ప్‌ డిస్మిస్‌’ అర్థం చెప్పు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెల్ప్‌ డిస్మిస్‌ పదానికి అర్థం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాల్లో సెల్ప్‌ డిస్మిస్‌ అనే పదం లేదన్నారు. రాజ్యాంగం, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ మాట్లాడుతున్న తీరు  కార్మిక వర్గాలకు పెను సవాల్‌ విసురుతోందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘాలన్ని ఏకమై కేసీఆర్‌ మెడలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్‌టీసీ, సీపీఎంఎల్‌ కూడా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నాయని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే నాలుగురైదుగురు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారని, 1200 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో ప్రజలకు జవాబు చె​ప్పాలని డిమాండ్‌ చేశారు.

కార్మికులకు అండగా ఉంటాం: టీజేఎస్‌
ఆర్టీసీ కార్మికులకు చివరి వరకు అండగా ఉంటామని తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) నాయకులు స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెలో జీవితాలను సైతం లెక్కచేయకుండా పాల్గొని ఆర్టీసీ కార్మికులు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top