సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్‌లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


