
సాక్షి, హైదరాబాద్: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న భారీ డేటా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగుల అదుపుకు సంబంధించి విచారణ ముగిసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన విషయం విదితమే. డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులను తాము అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ నిమిత్తం పిలిచామని టీఎస్ ఏజీ బీఎస్ ప్రసాద్ ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పిందని ఆయన తెలిపాపారు.
కాగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. (ఐటీ గ్రిడ్స్ స్కాం: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు) ఇక డేటా చోరీ కేసులో కీలక నిందితుడు అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు విజయవాడ, నెల్లూరు, విశాఖ, బెంగళూరులో గాలిస్తున్నాయి. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది.