డీజిల్‌ వాహనాలపై  ఆంక్షలు?

Telangana Govt Plans To Ban 12 Years Old Diesel Vehicle - Sakshi

పాత వాహనాలకు పొగ కాలుష్య నియంత్రణపై సర్కారు దృష్టి

భాగ్యనగరం ఢిల్లీలా మారకముందే చర్యలకు నిర్ణయం

మోటారు వాహనాల చట్ట సవరణకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య మన నగరాన్ని తాకేంతవరకు చూడకుండా తొందరగానే మేల్కోవాలని సర్కారు యోచిస్తోంది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నగరాన్ని వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్‌.. మొక్కలు పెంచడంతోపాటు డీజిల్‌ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. కొత్త జరిమానాలను ప్రతిపాదిస్తూ చట్ట సవరణ చేయనున్నట్టు తెలిసింది.

పన్ను పెంపు యోచన..:
హైదరాబాద్‌ నగర రహదారులపై దాదాపు 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ వాహనాల కంటే డీజిల్‌ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే, దీనిని చాలామంది పెద్ద భారంగా భావించడంలేదు. దీంతో ఈ పన్ను మొత్తాన్ని మరింత పెంచితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక 12 ఏళ్లు తిరిగిన డీజిల్‌ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో బ్యాటరీ వాహనాలకు పన్నులు, ఇతరత్రా అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం ద్వారా జనం వాటి పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వానికి రవాణాశాఖ ప్రతిపాదనలు ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top