breaking news
trasport deportement
-
వాహన విస్ఫోటం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వాహన విస్ఫోటం దిశగా సాగుతోంది. గత ఐదేళ్లలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రస్తుతం గరిష్టస్థాయికి చేరుకుంది. తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 1,37,47,534 వాహనాలున్నాయి.15 ఏళ్ల కింద రాష్ట్రంలో వాహనాల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం లో 83 లక్షల కుటుంబాలు ఉండగా, వాహనాలు 1.37 కోట్లకు చేరాయి. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 9 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. కోవిడ్ వల్ల గత ఏడాది నుంచి ఆ సంఖ్య కొంత తగ్గగా, వచ్చే సంవత్సరం ఏకంగా 12 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఐదేళ్ల కిందట కోటి..సరిగ్గా ఐదేళ్ల కిందట రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును చేరింది. ఇప్పుడా సంఖ్య కోటిన్నరకు చేరువవుతోంది. మరో నాలుగేళ్లలో 2 కోట్లను మించుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం వాహనాల్లో బైక్‌ల వాటా ఏకంగా 74.25 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 1.02 కోట్ల బైక్‌లు ఉన్నాయి. గతంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని బైక్ ఆక్రమించింది. హైదరాబాద్ సహా పట్టణాల్లో కచ్చితంగా ఇంటింటా బైక్ ఉండాల్సిందే. గతంలో పండ్లు, పూలు విక్రయించేవారు సైకిళ్లను వినియోగించేవారు. రెండేళ్ల నుంచి వారు మోపెడ్లను వినియోగించటం ప్రారంభించారు. కొన్ని మోపెడ్ తయారీ సంస్థలు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాయి. నెలకు 55 వేల బైక్‌లు.. ప్రతినెలా సగటున 55 వేల నుంచి 60 వేల వరకు బైక్‌లు అమ్ముడవుతున్నాయి. ఇక కార్ల కొనుగోలు కూడా బాగానే పెరిగింది. మధ్యతరగతి వారు ప్రస్తుతం కారును అవసరంగా భావించే పరిస్థితి వచ్చింది. లోన్ పద్ధతిలో కార్లను విక్రయిస్తున్నారు. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కార్ల తయారీ సంస్థలు తక్కువ ధరలో వచ్చే కార్ల మోడళ్లను పెద్ద సంఖ్యలో పవేశపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత కార్ల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ప్రతి నెలా 12 వేల నుంచి 16 వేల వరకు కార్లు అమ్ముడవుతున్నాయి. కోవిడ్ కాలంలోనూ అదే తీరు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో చాలాకుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. కానీ వాహనాలు కొనే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. కరోనా వల్ల ఇతరులతో కలసి ప్రయాణించేందుకు భయపడ్డ జనం.. సొంత వాహనం ఉండాలన్న అభిప్రాయంతో వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న 2 నెలలు కాకుండా.. మిగతా నెలల్లో వాహనాల కొనుగోలు భారీగానే సాగింది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కోవిడ్ భయం ఎక్కువగానే ఉంది. ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 4,39,188 ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.6 లక్షలు అమ్ముడయ్యాయి. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోగా, గత నవంబర్‌లో 75 వేలు విక్రయమయ్యాయి. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే, గత డిసెంబరులో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్ముడుకాగా, గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, 2020 డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2019 సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే వాహనాలు అమ్ముడవటం విశేషం. ఈ మూడు నెలల్లో సగటున నెలకు 75 వేల బైక్‌లు అమ్ముడు కాగా, కార్లు 18 వేల చొప్పున అమ్ముడయ్యాయి. ఉధృతంగా సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయం.. సెకండ్‌హ్యాండ్ వాహనాల అమ్మకాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కోవిడ్ సమయంలో అల్పాదాయ వర్గాలు సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు దృష్టి సారించారు. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.1 లక్షల బైక్‌లు చేతులు మారగా, 2020లో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు, 99,807గా ఉండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఇలా.. ద్విచక్ర వాహనాలు: 1,02,12,380 వ్యక్తిగత కార్లు: 16,69,490 మోటార్ క్యాబ్: 1,15,857 సరుకు రవాణా వాహనాలు: 5,45,653 ట్రాక్టర్, ట్రెయిలర్స్: 5,94,677 ఆటో రిక్షా: 4,41,135 స్టేజీ క్యారేజీ వాహనాలు: 18,462 విద్యాసంస్థల బస్సులు: 27,883 మ్యాక్సీ క్యాబ్: 31,070 కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు: 9,063 ప్రైవేటు సర్వీస్ వెహికిల్స్: 2,942 ఈ–రిక్షా కార్ట్: 208 ఇతర వాహనాలు: 78,714 -
12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య మన నగరాన్ని తాకేంతవరకు చూడకుండా తొందరగానే మేల్కోవాలని సర్కారు యోచిస్తోంది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నగరాన్ని వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్.. మొక్కలు పెంచడంతోపాటు డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. కొత్త జరిమానాలను ప్రతిపాదిస్తూ చట్ట సవరణ చేయనున్నట్టు తెలిసింది. పన్ను పెంపు యోచన..: హైదరాబాద్ నగర రహదారులపై దాదాపు 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే, దీనిని చాలామంది పెద్ద భారంగా భావించడంలేదు. దీంతో ఈ పన్ను మొత్తాన్ని మరింత పెంచితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక 12 ఏళ్లు తిరిగిన డీజిల్ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో బ్యాటరీ వాహనాలకు పన్నులు, ఇతరత్రా అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం ద్వారా జనం వాటి పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వానికి రవాణాశాఖ ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. -
ప్రైవేటు బస్సుల పై దాడులు
కొరడా ఝుళిపించిన రవాణా శాఖ సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్ , ముంబై రూట్లలో తిరుగుతున్న బస్సులపై 156 కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను ఎగవేత, వాణిజ్య సరుకులను తీసుకెళ్లడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ప్రాథమిక చికిత్స బాక్స్ లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం వంటివి ఈ దాడుల్లో బయటపడ్డాయి. కొన్ని బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.