వనమేధం | Telangana Forest Department Negligence | Sakshi
Sakshi News home page

వనమేధం

Jan 11 2019 12:57 PM | Updated on Jan 11 2019 12:57 PM

Telangana Forest Department Negligence - Sakshi

కలపను తరలిస్తున్న లారీ

తలమడుగు(బోథ్‌): మానవాళి మనుగడకు అడువులే ఆధారం. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ జీవరాశికి ఎంతో ఉపయోగపడుతున్న అరణ్యంలో వనమేధం జోరుగా జరుగుతోంది. అటవీపెంపకానికి ఓవైపు ప్రభుత్వం రూ.కోట్లువెచ్చి హరితహారం మొక్కలు నాటుతుంటే పచ్చని చెట్లను నరికిస్తూ ఇతరప్రాంతాలకు తరలించి కలప స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నారు. గ్రామాల్లో పంటపొలాల్లోని  గట్లపై, వాగుల సమీపంలో చెట్లను విక్రయించాలన్నా, తరలించాలన్నా తప్పనిసరిగా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. కాని ఇదేమీ లేకుండానే వ్యాపారులు చెట్లను నరికి కలప తరలిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారులు మూడు చెట్లు ఆరు దుంగులుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు. అడవిని కాపాడే అధికారులు ఏమీ పట్టనట్లు నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉన్నాయి.

అంతటా ఇదే తంతు జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లో కలప తరలుతోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన  తాంసి తలమడుగు, బేల, జైనథ్, బజార్‌హత్నూర్, బోథ్, మండలం నుంచి కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామపంచాయతీల్లో అటవీ సంపద, వ్యవసాయ పొలాలు, వాగులు, కొండల సమీపంలో చెట్లు నేలకొరుగుతున్నాయి. వ్యాపారులు రైతు వద్ద పట్టా జిరాక్స్‌ పత్రాలు ఒక్కసారి తీసుకొని పలుమార్లు కలప తరలిస్తున్నారు. దీంతో అటవీప్రాంతాలు, పంటపొలాలు, ఎడారులుగా మారిపోతున్నాయి. చెట్లను నరికి లారీల్లో మామిడి, వేపచెట్లు, తుమ్మ , చింత తదితర చెట్లు నిత్యం నరికేస్తున్నారు. చెట్లను క్షణాల్లో నరికేందుకు పెట్రోల్‌ యంత్రాలు విచ్చలవిడిగా మార్కెట్లోకి రావడంతో వ్యాపారుల పని సులువుగా మారింది. ఇంత జరుగుతున్నా లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు.

అనుమతి లేకుండా అక్రమంగా రవాణా
చెట్లను నరకాలంటే అటవీశాఖ రేంజ్‌ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన తరువాత రైతు వ్యాపారికి తన పట్టా పాసుపుస్తకం, జిరాక్స్‌ అందించాలి. రైతు చెట్టు నరికిన స్థానంలో మరో మొక్క నాటాలి. కానీ అవి ఏమీ లేకుండానే వ్యాపారులు రైతుకు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి విలువైన చెట్లు డింబర్‌డిపోలకు తరలిస్తున్నారు. అధికారులను మభ్యపెడుతూ కలపదందా కొనసాగిస్తున్నారు.  అటవీశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం మూలంగా పచ్చని చెట్లతో ఉండాల్సిన పొలాలు, కొండలు ఎడారిగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను నరికి అక్రమ కలప రావాణా సాగించే వారిపై చర్యలు తీసుకొని జిల్లాలో వనమేధం పూర్తిగా నిర్మూలించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం 
గ్రామాల్లో నుంచి అనుమతి లేకుండా తరలిస్తే సమాచారం అందించాలి. రవాణాపై మా దృష్టికి రాలేదు. వస్తే  వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. పట్టాభూమిలో నుంచి చెట్లు నరికి విక్రయిస్తే తప్పనిసరిగా వాటిస్థానంలో రైతు మరో మొక్కనాటాలి. ఇప్పటివరకు ఎవ్వరికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. – ప్రకాశ్, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement