గులాబీ ముల్లు!

Telangana Elections TRS MLA Candidates Unsatisfied Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం శాసనసభను రద్దు చేసిన నాడే ఉమ్మడి జిల్లాలో పది మంది పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గులాబీ దళపతిని అసంతృప్తి రాగాలు వెంటాడుతూనే ఉన్నాయి. పది మంది అభ్యర్థుల్లో తొమ్మిది మందిని సిట్టింగ్‌లను ఎంపిక చేసి చెన్నూర్‌లో మాత్రం విప్‌గా సేవలందించిన నల్లాల ఓదెలును మార్చి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.

ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన నాయకులు తీరా చోటుచేసుకున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. బాహాటంగానే తమ నిరసన వ్యక్తం చేసిన వారు కొందరైతే... చాపకింది నీరులా అసంతృప్తిని వెళ్లగక్కుతూ ప్లాట్‌ఫారం తయారు చేసుకుంటున్న వారు మరికొందరు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెన్నూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన స్వీయ గృహ  నిర్బంధం ఎపిసోడ్‌తో అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లయింది. ఓదెలును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌ చేసి హైదరాబాద్‌ పిలిపించుకోవడంతో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీలోని ఇతర నాయకులు, రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

చెన్నూర్‌పై పట్టు పడుతున్న ఓదెలు
చెన్నూర్‌లో 2009 నుంచి మూడుసార్లు విజయం సాధించిన నల్లాల ఓదెలు ఈసారి కూడా తనకు టిక్కెట్టు ఖాయమనే ధీమాతోనే ఉండేవారు. తనకు ప్రమాదం పొంచి ఉందంటే మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్‌తోనే నని భావించేవారు. అయితే మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీటివ్వాల్సిన అనివార్య పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌కు ప్రత్యామ్నాయం చూపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో గత 6వ తేదీన విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆ యనకు చెన్నూర్‌ అసెంబ్లీ సీటును కేటాయించారు. ఇది ఓదెలుకు పెద్ద దెబ్బ. తనకు టికెట్టు రాలేదని తెలియగానే హైదరాబాద్‌ వెళ్లిన ఓదెలు రెండురోజుల పాటు మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఓదెలు నివాసానికి వెళ్లి కలిసిన సుమన్‌ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తనకే సీటు వస్తుందనే ధీమాను వ్యక్తం చేసిన ఓదెలు,,, సీఎంతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరుసటి రోజు మందమర్రికి వచ్చిన ఆయన సు మన్‌పై విమర్శలకు పదును పెట్టారు. ఇక మంగళవారం ఏకంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా ముఖ్యమంత్రి ఓదెలుకు ఫోన్‌ చేసి హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.

ముథోల్‌లో ముసలం పుట్టించిన వేణుగోపాలాచారి
ముధోల్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సముద్రాల వేణుగోపాలాచారి నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. అయితే ఆయనకు ముధోల్‌ను వదులుకోవడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన విఠల్‌రెడ్డికే మరోసారి టిక్కెట్టు ఖరారైంది. ఈ క్రమంలో రెండురోజుల క్రితం భైంసా వచ్చిన వేణుగోపాలాచారి తన అనుచరులు, అనుయాయులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చిన విషయాన్ని పునరాలోచించాలని ఆయన అనుచరులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందనే రీతిలో స్పందించారు. దీంతో ముధోల్‌లో కూడా ముసలం పుట్టినట్లయింది.
 
బోథ్‌లో గళం విప్పిన ఆదివాసీ నాయకులు
బోథ్‌లో పోటీ చేయాలని భావించిన ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ ఆశలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీళ్లు చల్లారు. ఆదివాసీలు బలమైన శక్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో లంబాడా వర్గానికి చెందిన సిట్టింగ్‌ బాపూరావు రాథోడ్‌కు సీటివ్వడాన్ని నగేష్, ఆయన అనుయాయులు జీర్ణించుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు తన వర్గీయులతో సమావేశమైన నగేష్‌ ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆదివాసీ సంఘాల నాయకులు నగేష్‌కు మద్ధతుగా గళం విప్పారు. బో«థ్‌ నుంచి లంబాడాకి సీటిస్తే తాము వ్యతిరేకిస్తామని తెగేసి చెప్పారు. ఇచ్చోడలో ప్రారంభమైన ఈ వ్యతిరేక గళాలు బుధవారం నుంచి అన్ని మండలాలకు వ్యాపిస్తాయనడంలో సందేహం లేదు.

ఖానాపూర్‌లో రాథోడ్‌ రణభేరి
అసెంబ్లీ సీటు హామీతోనే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన రమేష్‌ రాథోడ్‌ సిట్టింగ్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కే సీటివ్వడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. స్థానిక నినాదాన్ని తీసుకొచ్చిన ఆయన రేఖా నాయక్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్‌ను కూడా వదలలేదు. టికెట్టు ఇవ్వకపోయినా , ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్‌ తన జాగీరుగా ప్రకటించుకున్న రమేష్‌ రాథోడ్‌ స్థానికేతరులను తరిమికొట్టనున్నట్ల ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇక్కడ రమేష్‌ రాథోడ్‌ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
 
గులాబీ గూటిలో గుబులు
పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన స్థానాల్లో అంతర్గత ముసలం మొదలవడం పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. చెన్నూర్‌లో ఓదెలు ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని పార్టీ వర్గాలే ఆందళన వ్యక్తం చేస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓదెలు వెంట ఎంఆర్‌పీఎస్‌ ఉండడం, నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగానే ఉండడం కలవరపరిచే అంశమే. బోథ్‌లో ఆదివాసీ అంశాన్ని తెరపైకి తేవడం పక్కా ప్రణాళికలో భాగమే. బోథ్‌లో నగేష్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు.

ఇక్కడ ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండడంతో అదే వర్గానికి చెందిన నగేష్‌కు సీటిస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. బాపూరావు రాథోడ్‌కు ఆదివాసీ వర్గం దూరంగా ఉండడం నిర్వివాదాంశం. ముథోల్‌లో వేణుగోపాలాచారి రంగప్రవేశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. వేణుగోపాలాచారి 2014లో ఓడిపోయిన తరువాత ఈ నియోజకవర్గం గురించి పట్టించుకోవడం ఆయనకు మైనస్‌. మంచిర్యాలలో బీసీ నాయకుడు బేర సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండగా, టికెట్లు ఆశించిన ముఖ్య నాయకులు అభ్యర్థి దివాకర్‌రావు వెంట కనిపించకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top