
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా వ్యాప్తంగా వయస్సుల వారీగా ఓటర్ల లెక్క తేలింది. జాబితాలో కొత్తగా నమోదైన ఓటర్లు, యువ ఓటర్లు, మధ్య వయస్సు గల వారు, వృద్ధులు, 80 ఏళ్లకు పైబడిన వారు.. ఇలా అన్ని వయస్సుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. 18 నుంచి 29 ఏళ్ల వయస్సు గల వారిని యువ ఓటర్లుగా, 30 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిని మధ్య వయస్కులుగా, 60 నుంచి 79 ఏళ్లు ఉన్న వారిని వృద్ధులుగా పరిగణించడంతోపాటు 80ఏళ్లకు పైబడిన వారిని కూడా ఓటరు జాబితాలో చేర్చి వయస్సుల వారీ జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని వయస్కుల ఓటర్లు కలిపి 3,77,562 మంది ఉండగా, ఇందులో మధ్య వయస్సు గల ఓటర్లు 2,17,198 మంది ఓటర్లుగా ఉన్నారు.
జిల్లాలో 1,18,049 మంది ‘యువ’ ఓటర్లు ఉండగా, 38,790 వృద్ధ ఓటర్లు, 3,462 మంది 80ఏళ్లకు పైబడిన ఓటర్లు ఉన్నారు. 63 మంది ఇతరులు ఉన్నారు. ఈ విషయాలు ఈ నెలలో ఎన్నికల సంఘం ప్రకటించిన వర్గాల వారీ ఓటరు జాబితాలో స్పష్టంగా తేలింది. కాగా, జిల్లాలో మొత్తం 3,77,562 మంది ఓటర్లు ఉండగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,96,849 మంది, బోథ్‌లో 1,80,713 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, 30 ఏళ్ల నుంచి 80 ఏళ్లపైగా ఉన్న వయస్సుల వారీ ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఓటర్లు ఇలా..
జిల్లాలో మధ్య వయస్సున్న ఓటర్లు 2,17,198 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,07,278 మంది ఉండగా, 1,09,920 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం మధ్య వయస్సు గల ఓటర్లు 1,14,235 ఉండగా, ఇందులో 56,571 మంది పురుషులు ఉన్నారు. 57,664 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం మధ్య వయస్సు గల ఓటర్లు 1,02,963 మంది ఉండగా, ఇందులో పురుషులు 50,707 మంది, మహిళా ఓటర్లు 52,256 మంది ఉన్నారు.
యువత
తాజాగా విడుదలైన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 1,18,049 మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 61,298 మంది ఉండగా, మహిళలు 56,751 మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా యువత ఓటర్లను గమనిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 60,523 మంది యువ ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 31,280 మంది, మహిళలు 29,243 మంది ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 57,526 మంది ఉండగా, ఇందులో పురుషులు 30,018 మంది, మహిళలు 27,508 మంది యువ ఓటర్లుగా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 10,185 మంది యువత ఈ యేడాది జాబితాలో కొత్తగా చేరారు. ఇందులో 5,669 మంది పురుషులు ఉండగా, 4,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరు డిసెంబర్‌లో జరుగనున్న పోలింగ్‌లో కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వృద్ధులు
జిల్లాలో 38,790 మంది వృద్ధులు ఓటర్లుగా ఉన్నారని ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో ఉంది. వృద్ధ పురుషులు 17,661 మంది ఉండగా, వృద్ధ మహిళలు 21,129 మంది ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20,571 మంది వృద్ధ ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 9,787 మంది, మహిళలు 10,784 మంది ఉన్నారు. అలాగే బోథ్‌లో మొత్తం వృద్ధ ఓటర్లు 18,219 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,874 మంది ఉండగా, మహిళలు 10,345 మంది ఉన్నారు. ఇవీ కాకుండా జిల్లాలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 3,462 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో పురుషులు 1,158 మంది ఉండగా, 2,304 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.