నేడు జిల్లాకు కేసీఆర్‌

Telangana Election KCR  Campaign Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్, ఆర్మూర్‌లలో కేసీఆర్‌ బహిరంగ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. సోమవారం కామారెడ్డి, డిచ్‌పల్లి (నిజామాబాద్‌రూరల్‌), బోధన్, మోర్తాడ్‌ (బాల్కొండ) లలో సీఎం పర్యటించనున్నారు. హెలీకాప్టర్‌ ద్వారా కామారెడ్డికి చేరుకుని అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం డిచ్‌పల్లిలో బహిరంగ సభను ముగించుకుని, బోధన్‌కు వెళ్తారు. అక్కడి నుంచి మోర్తాడ్‌ మండల కేంద్రంలో జరిగే సభలో పాల్గొన్న అనంతరం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

ఏర్పాట్లు పూర్తి.. 
కేసీఆర్‌ బహిరంగ సభలకు ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సభా వేదికలను ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారి కోసం తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఒక్కో సభకు 25 వేల నుంచి 30 వేల మంది పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని జనాలను తరలించేందుకు సమాయత్తం చేస్తున్నారు. సభలను విజయవంతం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత నూతనోత్తేజం నింపవచ్చని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల ఆర్మూర్‌లో నిర్వహించిన కేసీఆర్‌ బహిరంగసభ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.
 
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత.. 
నిజామాబాద్‌ ఎంపీ కవిత కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. డిచ్‌పల్లి, మోర్తాడ్‌లలో పర్యటించిన ఆమె.. సభా వేదిక, ఇతర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్కొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్‌ అభ్యర్థి షకీల్‌ అమేర్‌లు దగ్గరుండి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
 
పోలీసు బందోబస్తు.. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పర్యటనను పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సభా వేదికలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top