బుజ్జగింపులు ఘరూ

Telangana Early Election Change Of Mahabubnagar Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముందస్తు ఎన్నికలతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అన్ని రాజకీయ పార్టీల్లో అసంతృప్తి గుప్పుమంటోంది. ముఖ్యం గా అందరికంటే ముందుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆశావహులు నిరసన గళం విప్పుతున్నారు. రహస్య సమావేశాలు, బరిలో నిలిచే అభ్యర్థి కార్యక్రమాలకు పోటీగా ఇతర కార్యక్రమాల వంటి వాటితో రాజకీయం రక్తి కడుతోంది. దీంతో పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగం గా ముఖ్యనేతలైన కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌ కుమార్, కవిత రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, వారికి ఎవరు ఏ విధంగా చెబితే వెనక్కి తగ్గుతారనే అంశాలపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీలో కూడా పలు నియోజకవర్గాల్లో టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహుల మధ్య సయోధ్య కుదిర్చే యత్నాల్లో ముఖ్యనేతలు తలమునకలైనట్లు తెలుస్తోంది.

వేగానికి అసంతృప్తుల బ్రేక్‌ 
ముందస్తు ఎన్నికల్లో జెట్‌ స్పీడ్‌ వేగంతో ఎవరికీ అందనంత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్‌ వేగానికి అసంతృప్తుల కారణంగా బ్రేకులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కల్వకుర్తి నియోజకవర్గం విషయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విషయంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు సదరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్ని విధాల అండగా నిలిచారు. కేడర్‌కు అందుబాటులో ఉండటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీగా కసిరెడ్డికి మరో మూడేళ్ల కాలపరిమితి ఉన్నా.. ఆయనకు అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరికగా ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో కేడర్‌ను సన్నద్ధం చేశారు. కానీ తీరా టిక్కెట్‌ దక్కకపోవడంతో మద్దతు దారులు అసంతృప్తికి గురవుతున్నారు.

అలాగే బాలాజీసింగ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి కూడా కల్వకుర్తి టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించగా జైపాల్‌యాదవ్‌ పేరును కేసీఆర్‌ ఓకే చేశారు. దీంతో వారి అనుచరుల నుంచి కూడా ఒత్తిడి వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టిక్కెట్‌ దక్కించుకున్న జైపాల్‌యాదవ్‌ అసంతృప్త నేతలను మచ్ఛిక చేసుకోవడం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అలాగే పార్టీని గాడిలో పెట్టడం కోసం ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగారు.

  • మక్తల్‌ నియోజకవర్గంలో రోజురోజుకు సమస్య తీవ్రరూపం దాలుస్తుండడంతో ముఖ్యనేతలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. టిక్కెట్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్న గవినోల్ల గోపాల్‌రెడ్డి, జలేందర్‌రెడ్డి తదితర నేతలు రహస్య సమావేశాలతో పాటు వేరుగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  
  • టికెట్‌ దక్కించుకున్న చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌లో సోమవారం ప్రచారం చేయనున్నట్లు ప్రకటించగా... అసంతృప్త నేతలు మాత్రం నర్వలో కార్యక్రమం చేపట్టారు. ఇలా మొత్తం మీద వివా దం రక్తికడుతోంది. దీంతో పార్టీ పరిశీలకులుగా ప్రత్యేక దూతలను పంపినట్లు సమాచారం.

అసంతృప్తుల విషయంలో అలంపూర్, గద్వా ల, కొడంగల్‌ నియోజకవర్గాలలో కూడా నిరువుగప్పిన నిప్పులా మారింది. ఆయా స్థానాల్లో టిక్కెట్టు లభిస్తుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవడంతో వారి అనుచరులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అలంపూర్‌లో మందా జగ్నాథం కుటుంబం తీవ్రంగా మధనపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

  • అయితే ఇప్పటికే జగ్నాథానికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టును కేబినెట్‌ ర్యాంకుతో నియమించడం, నేరుగా పార్టీ అధినేత కేసీఆర్‌ నచ్చజెప్పినట్లు వినికిడి. 
  •  గద్వాలలో అసంతృప్తిగా ఉన్న బీసీ కమిషన్‌ సభ్యుడు ఆంజనేయులు గౌడ్‌ విషయంలో కూడా పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. 
  • ఇక కొడంగల్‌ విషయంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి పార్టీ అధిష్టానం చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది కిందటే కొడంగల్‌లో పోటీ విషయంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డికి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుర్నాథరెడ్డి కూడా నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు.

సమన్వయం దిశగా కాంగ్రెస్‌ 
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీ అధిష్టానం చాలా స్పష్టంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆశావహులకు పార్టీ అధిష్టానం కచ్చితమైన సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. టికెట్‌ ఎవరికి దక్కినా... మిగతా వారు తిరుగుబాటు జెండా ఎగరవేయకుండా సహకరించాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్‌ ఎవరికి వచ్చినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా నేతలు ప్రకటనలు వెలువరిస్తున్నారు. కొల్లాపూర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు జగదీశ్వర్‌రావు, సుధాకర్‌రావు ప్రయత్నాలు చేశారు.

అయితే తాజాగా జగదీశ్వర్‌రావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టికెట్‌ ఎవరికి వచ్చినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే నారాయణపేట నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన కె.శివకుమార్‌ విషయంలో పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్న మిగతా నేతలు కూడా ఎవరికి టిక్కెట్‌ వచ్చిన కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. అలాగే టిక్కెట్ల పోటీ ఉన్న దేవరకద్ర, మహబూబ్‌నగర్, మక్తల్‌లోనూ కలిసి పని చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా మొత్తం మీద పార్టీ ముఖ్యనేతల బుజ్జగింపుల నేపథ్యంలో కొన్నిచోట్ల వివాదాలు సద్గుమణుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top