అమర జవాన్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: కేసీఆర్‌

Telangana Cm Kcr Announced Rs 5 Cr Compensation To Santoshbabu Family - Sakshi

వీరజవాన్ల సమున్నత త్యాగం!

సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని కేసీఆర్‌ అన్నారు. ‘వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంట ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాల’’ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు.

తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం
 కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ భరోసాగా ముందుకొచ్చిన తీరు పట్ల సంతోష్‌ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం ఇచ్చారని వారు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జగదీష్‌రెడ్డి మొదటినుంచి తమకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని కల్నల్‌ సంతోష్‌ భార్య సంతోషి చెప్పారు.

చదవండి: కల్నల్‌ సంతోష్‌కు కాంస్య విగ్రహం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top