మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్‌’ క్లియర్‌

Telangana Cabinet Approved To Supply 3 TMS Water From Medigadda - Sakshi

కాళేశ్వరంలో అదనపు నీటి తరలింపునకు రూ.14,362 కోట్లు

ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్‌

సాక్షి, హైదరాబాద్‌ : బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునే ప్రణాళికకు అంగీకారం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో అదనంగా మరో టీఎంసీ తీసుకునే ప్రణాళికను ఆమోదించడమే కాకుండా, దానికయ్యే వ్యయ అంచనాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారానే నీటిని తీసుకునేలా రూపొందించిన ప్రణాళికకు ఓకే చెప్పింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకయ్యే అదనపు వ్యయాల అంచనాలను సమ్మతించింది. 

(చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు )
 
మిడ్‌మానేరు దిగువన పైప్‌లైన్‌ ద్వారానే.. 
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేడిగడ్డ పంప్‌హౌస్‌ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా 3 పంప్‌హౌస్‌ల్లో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటా ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటికి అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. గత అంచనా 3 పంప్‌హౌస్‌లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392కోట్లకు చేరుతోంది.ఈ పెరిగిన వ్యయాలకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు మొదట టన్నెల్‌ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతున్న నేపథ్యంలో పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14,362 కోట్ల మేర వ్యయం అవుతుండగా, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్‌ వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. 

పాలమూరు రుణాలు.. ఎస్‌ఎల్‌బీసీ.. ఎస్సారెస్పీ కాల్వలు.. 
వీటితో పాటే కేబినెట్‌ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు కేబినెట్‌ అనుమతినిచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే ఈ రుణాల సేకరణ జరుగనుంది. ఇక దీంతో పాటే ఎస్సారెస్పీ స్టేజ్‌–2లో కాల్వల లైనింగ్‌ పనుల కోసం రూ .653 కోట్ల కేటాయింపునకు సైతం ఓకే చెప్పింది. అలాగే ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి రూ.63.50 కోట్ల అడ్వాన్సులు కోరగా దానికి సమ్మతించింది. దీంతో పాటే కొత్తగా గొలుసుకట్టు చెరువుల అనుసంధానానికి వీలుగా తూములు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించి, పనులు సైతం మొదలు పెట్టగా, ఆ పనులను చేపట్టేందుకు అంగీకారం తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top