అక్షరాలా రెండు లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్‌ | Telangana Budget To Cross Rs 2 Lakh Crore | Sakshi
Sakshi News home page

సాగు, సంక్షేమాలదే జోరు

Feb 21 2019 1:39 AM | Updated on Feb 21 2019 4:09 AM

Telangana Budget To Cross Rs 2 Lakh Crore - Sakshi

బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయం, సంక్షేమానికే కేటాయించినట్లు..

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్ల మార్క్‌ దాటబోతోంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.2.13 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కంటే వచ్చే ఆర్థిక సంవత్సరం పద్దు దాదాపు రూ.39 వేల కోట్లు అధికం. రాష్ట్ర పన్నుల రాబడిలో 28% వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2 వేలు అదనంగా ఇవ్వాల్సి రావడం, ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి, రైతులకు రూ. లక్ష రుణమాఫీ వంటి హామీల అమలుతో బడ్జెట్‌ పరిమాణం పెరగనుంది. పెరిగిన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌కు పరిమితమవుతున్న కేసీఆర్‌ సర్కారు శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను బడ్జెట్‌లో ప్రస్తావించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న కొత్త పథకాలతో పాటు ఉన్నవాటిని పెంచేలా బడ్జెట్‌లో భారీ కేటాయింపులే చేసినట్లు తెలిసింది.
 


రాష్ట్ర ఆదాయం 90 వేల కోట్లే! 
ఈ ఏడాది పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది అంచనా వేసిన దానికంటే వృద్ధిరేటు ఎక్కువగా ఉండటంతో వచ్చే ఏడాదికి కూడా దాదాపు 18% ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది రాష్ట్ర పన్నుల ద్వారా రూ.73,751 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ కింద రూ.40వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. మార్చి 31వ తేదీ నాటికి అది రూ.43వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంటున్నారు. అలాగే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్‌ విభాగాల నుంచి నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ రాబడి ఉంది. ఒక్క రవాణ శాఖ మాత్రమే టార్గెట్‌కు స్వల్ప దూరంలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గత డిసెంబర్‌ 31వ తేదీ నాటికి నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. దీంతో వచ్చే ఏడాది ఆ మొత్తాన్ని రూ.82 వేల కోట్లకు పెంచడంతో పాటు పన్నేతర ఆదాయం రూ.13 వేల కోట్లుగా ఉంటుందని భావించి రూ.95 వేల కోట్లుగా అంచనా వేసింది. మూలధన వసూళ్ల కింద ఈ ఏడాది రూ.43,507 కోట్లు నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని రూ.55వేల కోట్లకు పెంచింది. ఇవి కాకుండా కేంద్ర పన్నుల వాటా కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,207 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే లభించినట్లు సమాచారం. ఈ ఏడాది అంచనా వేసిన మొత్తం పెరడగంతో దాని ఆధారంగా వచ్చే ఏడాదికి రూ.25వేల కోట్లుగా అంచనా వేసిందని సమాచారం. ఇక కేంద్ర గ్రాంట్ల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,041 కోట్లు అంచనా వేసిన ప్రభుత్వం వచ్చే ఏడాదికి రూ.38 వేల కోట్లు వస్తుందని భావిస్తోంది. 
 
సాగునీటికి 25 వేల కోట్లు 
ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తంలో కేటాయింపులు జరిపింది. బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయం, సంక్షేమానికే కేటాయించినట్లు తెలిసింది. గడచిన ఏడాది రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2వేలు పెంచి.. రూ.10వేలు చేయడంతోపాటు రూ.లక్ష అంతకంటే తక్కువ మొత్తంలో ఉన్న రైతు రుణాలను నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి వీలుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement