డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాచిగూడ: డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బర్కత్‌పురలోని బిఆర్‌కేఆర్ హైస్కూల్‌లో శుక్రవారం జరిగిన అంబర్‌పేట నియోజకవర్గం పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ పోస్టులను టీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తే హైదరాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి ఉత్తమ ఫలితాలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. 2016 సంవత్సరంలో పదో తరగతిలో అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో 80 శాతం ఉత్తీర్ణత నమోదైందని, వచ్చే విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సురేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.