‘కాళేశ్వరం’ అడ్డుకునే వాళ్లే మళ్లీ వస్తున్నారు!

TDP Against To Kaleshwaram Project Says Etela Rajender - Sakshi

కాంగ్రెస్, టీడీపీ ఓట్లు ఎలా అడుగుతాయి?

గొల్ల, కురుమల ఆశీర్వాద సభలో మంత్రి ఈటల

జమ్మికుంట (హుజూరాబాద్‌): కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లే మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. కాళేశ్వరం చేపడితే తమ ప్రాంతానికి నీళ్లు రావని ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు చేశారని, అలాంటి వ్యక్తితో జత కట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో గొల్ల, కురుమల ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు నీరు లేక బోర్లు ఎండిపోయాయని, వచ్చిరాని కరెంట్‌తో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నాడు కరెంట్‌ కోసం రైతులు హైదరాబాద్‌లో ఆందోళన చేస్తే కాల్పులు జరిపించి.. వారి రక్తాన్ని కళ్ల చూసిన చరిత్ర ఆంధ్ర పాలకులదన్నారు.

అలాంటివాళ్లే ఇప్పుడు ఏకమై మళ్లీ వస్తున్నారని, వాళ్లకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. పదేళ్ల క్రితం ఎన్‌సీడీసీ నిధులు రూ.400 కోట్లు వస్తే.. నాటి పాలకులు వాటిని ఖర్చు చేసేందుకు గ్యారంటీ సంతకం పెట్టలేదని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ ఫైల్‌పై సంతకం పెట్టి నిధులను గొల్ల, కురుమలకు రుణాల రూపంలో ఇప్పించానన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top