‘తుంగ’పై అభిప్రాయాలు చెప్పండి

Talk at Tungabhadra board meeting - Sakshi

తెలంగాణ, ఏపీఅభిప్రాయాలు కోరిన బోర్డు

కొత్త రిజర్వాయర్‌ నిర్మించే ఆలోచనలోకర్ణాటక

తుంగభద్ర బోర్డు సమావేశంలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర డ్యామ్‌లో పేరుకున్న పూడికతో జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు కర్ణాట క కొత్త ప్రయత్నాలకు దిగింది. పూడికతో నష్టపోతున్న నీటిని, అంతే స్థాయిలో ఒడిసిపట్టేలా కొత్త రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. సుమా రు 32 టీఎంసీల సామర్ధ్యంతో తుంగభద్రకు ఎగువ న నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్‌కోసం తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై బోర్డు దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దీనిపై ఇరు రాష్ట్రా లు చెప్పే అభిప్రాయాల మేరకు కొత్త రిజర్వాయర్‌ నిర్మాణం ముందుకు సాగనుంది. గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌తో పాటు కర్ణాటక, ఏపీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రలో పూడికపై ప్రధాన చర్చ జరిగింది.
 
పూడిక తీసేందుకు రూ.12,500 కోట్ల ఖర్చు 
ఈ సందర్భంగా తుంగభద్ర పూడికపై కర్ణాటక ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. డ్యాంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోవడంతో నీటి మట్టం సామర్థ్యం తగ్గిపోతోంది. 1953లో డ్యాం ప్రారంభం సమయం లో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా, పూడిక పెరిగిపోవడంతో 2015 నాటికి 100 టీఎంసీలకు పడిపోయింది. మొత్తంగా 32 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని డ్యామ్‌ కోల్పోయింది. పూడిక పెరగడంతో రాష్ట్రాల వాటా తగ్గిపోయి మూడు రాష్ట్రాలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో డ్యాంను పరిరక్షించాల్సిన అవసరం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపై ఉంది. అలాగే కేంద్రం కూడా మూడు రాష్ట్రాలతో చర్చించి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి. లేనిపక్షంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఆయ కట్టు భూములకు నీరందక వేలాది ఎకరాలు బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. పూడికను తొలగించాలంటే టీఎంసీ నీటికి రూ.380 కోట్లు ఖర్చవుతుందని, ఆ లెక్కన 32 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా పూడిక తీసేందుకు రూ.12,500 కోట్లు ఖర్చవుతుందని వివరించింది.

పూడిక మట్టిని పారవేసేందుకు 65 వేల ఎకరాల భూమి అవసరం ఉం టుందని తెలిపింది. ఇది భారీ వ్యయంతో కూడుకు న్న దృష్ట్యా, పూడిక నష్టాన్ని సరిచేసేందుకు ప్రత్యా మ్నాయాలను వివరించింది. 32 టీఎంసీల నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని, దీనికి రూ.9,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. తుంగభద్ర కింద ప్రస్తుతం 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడిక వల్ల ప్రస్తుతం 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్‌తో ఆ నష్టాన్ని పూడ్చు కునే అవకాశం ఉంటుందని తెలిపింది.

తుంగభద్రకు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్ధ్యాన్ని పెంచుతామని, ఈ మూడు రిజర్వాయ ర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. అయితే దీనిపై తెలంగాణ, ఏపీలు ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌లు సమర్పిస్తే దాన్ని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని ఇరు రాష్ట్రాలు బోర్డుకు చెప్పినట్లుగా తెలిసింది.

జూన్‌ నాటికి ఆర్డీఎస్‌.. 
తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టాల్సిన కాల్వల ఆధునికీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా అటు బోర్డు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని భేటీలో తెలంగాణ నిలదీసింది. ఈ కాల్వల ఆధునికీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరింది.

కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపి పనుల కొనసాగింపునకు ఏపీని ఒప్పించినా, పనులను అడ్డగించిందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పనులు కొనసాగించరాదని కర్ణాటకను ఏపీ అధికారులు హెచ్చరించడంతో పనులు నిలిచిపోయాయని బోర్డ్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బోర్డు స్పందిస్తూ, పనులు ఈ జూన్‌ నాటికి పూర్తయ్యేలా చూ డాలని ఏపీ, కర్ణాటకకు సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆర్డీఎస్‌లో ఉన్న వాటాలను వినియోగంలోకి తెచ్చేలా తెలంగాణ తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టి నీటి విడుదల చేసిందని ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. అయితే ఇది తమ పరిధి కాదని బోర్డు తేల్చినట్లుగా సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top