'వాళ్లు చెత్త నేతలు.. అది దరిద్ర కూటమి'

టీడీపీ- బీజేపీ కూటమిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకున్నట్లే
పెళ్లికి డబ్బిచ్చానన్న బాబు.. లోకేశ్ పై ఒట్టేసి ఆ మాట చెబుతాడా?
పసుపు, కాషాయ పార్టీలపై మంత్రి తలసాని విమర్శలు
హైదరాబాద్: టీడీపీ-బీజేపీ కలిస్తే రాలేది బూడిదేనని తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ-బీజేపీలది దరిద్ర కూటమని.. అక్కడున్నవాళ్లంతా చెత్తనేతలేనని విమర్శించారు. వాళ్లను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకున్నట్లేనని ఎద్దేవా చేశారు.
శుక్రవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 'నా పిల్లల పెళ్లికి డబ్బులిచ్చానన్న చంద్రబాబు ఆ విషయాన్ని లోకేశ్ మీద ఒట్టేసి చెప్పగలడా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ కు ఏపీ ఉద్యోగులు కూడా మద్దతు పలుకుతున్నారని తెలిపారు. తన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందన్న తలసాని.. ఎమ్మెల్యేగానే పోటీచేస్తానని మరోసారి స్పష్టం చేశారు.