సాక్షి, హైదరాబాద్: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన డిమాండ్ నెగ్గించుకుంటారా.. లేక వెనక్కు తగ్గుతారా? అన్నది నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీలిమిటేషన్ సైతం ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అస్తవ్యస్తంగా చేశారని పేర్కొన్న ఆయన సికి ంద్రాబాద్‌ను ముక్కలుగా చేసి మల్కాజిగిరి కార్పొరేషన్‌లో కలిపితే చూస్తు ఊరుకోబోమనే డిమాండ్‌తో సికింద్రాబాద్‌కు చెందిన వివిధ వర్గాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే.
ఈ నెల 17న భారీ ర్యాలీ..
సికింద్రాబాద్ ఎప్పటినుంచో అటు జీహెచ్‌ఎంసీలో, ఇటు హైదరాబాద్ జిల్లాలో భాగంగానే ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా తాను మారుస్తున్నదంటూ ఏమీ లేదని ఇటీవల సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు ఉండబోదనే చాలామంది భావిస్తున్నారు. తన డిమాండ్ సాధనకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న శ్రీనివాస్‌యాదవ్.. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీరోడ్ గాంధీ విగ్రహం వరకు పదివేల మందితో భారీ ర్యాలీ సహా వివిధ కార్యక్రమాలు ప్రకటించారు.
ముందుకా.. వెనకకా?
ఉద్యమానికి శ్రీకారం చుడుతూ బాలంరాయి లీ ప్యాలెస్‌లో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో సీఎంనుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ఆవేశంలో చేశానని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం అన్నా, మంత్రులన్నా తనకు గౌరవమేనన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పర్సనల్ అజెండా అంటూ లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే తప్పకుండా ఉపసంహరించుకుంటానని వ్యాఖ్యానించారు. గట్టి గా మాట్లాడినంత మాత్రాన కొమ్ములొచ్చినట్లు కాదని, ఆత్మాభిమానం, అస్తిత్వం కోసమే తమ పోరాటమన్నారు. సికింద్రాబాద్‌ను కార్పొరేషన్‌గా కానీ, జిల్లాగా కానీ చేయాలని, లేని పక్షంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలనేదే తమ అభిమతమన్నారు. దీంతో ఏం జరగనుందన్నది నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో చూద్దామనే ధోరణిలో వేచి చూస్తున్నారు.


