
మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న తలసాని. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, బండ ప్రకాశ్, గంగుల కమలాకర్ తదితరులు
త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్‌ఎస్ బీసీ ప్రతినిధుల బృందం
తలసాని అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీసీ నాయకుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో బీఆర్‌ఎస్ బీసీ ప్రతినిధులం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు.
తెలంగాణభవన్‌లో తలసాని అధ్యక్షతన మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్, బీజేపీ విధానాలపై చర్చించారు. అనంతరం మాజీమంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే, ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.
9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని తాము అసెంబ్లీ వేదికగా చెప్పామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఢిల్లీలో ధర్నాపేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలు పెట్టిందని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, ఖాళీగా ఉన్న మూడు
మంత్రి పదవులకు బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు.
⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలవుతున్నదని మధుసూదనాచారి విమర్శించారు. బీసీలకు రక్షణ కవచంలా బీఆర్‌ఎస్ పార్టీ నిలుస్తుందని, బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ కుటిలనీతిని ఎండగడతామన్నారు.
⇒ ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండేసి అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మోసగించిందని గంగుల కమలాకర్ విమర్శించారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి మూడురోజుల పాటు ఢిల్లీలో ఉంటామని చెబుతున్న సీఎం, మంత్రులు ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఏం చేస్తారో చెప్పాలన్నారు.
⇒ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలను మోసగిస్తూ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో మొండిచేయి చూపుతోందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
⇒ ప్రచారయావ మినహా బీసీ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.