సొంతగూటికి ‘సుద్దాల’? | suddala devaiah to join tdp? | Sakshi
Sakshi News home page

సొంతగూటికి ‘సుద్దాల’?

May 29 2014 10:45 AM | Updated on Sep 4 2018 5:07 PM

సొంతగూటికి ‘సుద్దాల’? - Sakshi

సొంతగూటికి ‘సుద్దాల’?

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సొంత గూటి వైపు కన్నేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సొంత గూటి వైపు కన్నేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. అధిష్టానం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అప్పుడు వచ్చి వాలుతానన్నట్లుగా జిల్లాలోని పార్టీ ముఖ్యులతో ఇప్పటికే తన రాయబారం పంపించినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన మహానాడు సమావేశాల సందర్భంగా ఈ విషయం పార్టీ శ్రేణుల్లో గుప్పుమంది.
 
 గతంలో మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుద్దాల దేవయ్య చంద్రబాబు హయాంలోమంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది... తెలంగాణ ఉద్యమం పోటెత్తిన సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. తీరా... ఎన్నికల ముందు పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. చొప్పదండి నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు తెచ్చుకొని పోటీకి దిగారు. టీఆర్‌ఎస్ ప్రత్యర్థి బొడిగె శోభపై దాదాపు 55 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేవయ్య తన సొంత నియోజకవర్గంలో కేవలం 31,860 ఓట్లు సాధించారు.
 
 అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన కుమారుడు గౌతమ్ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. రిజర్వుడు నియోజకవర్గం కావటం.. సొంత నియోజకవర్గం కావటం తనకు కలిసొచ్చినా.. ఓటమి చవిచూడటంతో దేవయ్య పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌లో చేరటం వల్ల తనకు కలిసి వచ్చిందేమీ లేదని... అప్పటికే తన వెంట ఉన్న కేడర్ కేడర్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరిందని.. దేవయ్య ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్నట్లుగా ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో సీనియర్ నేతగా తనకు ఉన్న గుర్తింపు కాంగ్రెస్‌లో లేకపోవటంతోపాటు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవటంతో.. అందులో ఉండీ ప్రయోజనమేమీ లేదని దేవయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావటంతో గతంలో తనకున్న పరిచయాలు.. కనీస సంబంధాలు కొనసాగించేందుకు టీడీపీలో చేరడమే సరైందనే కోణంలో పావులు కదిపినట్లు సమాచారం. రెండు రోజుల మహానాడు సమావేశాలకు దేవయ్య తన కుమారుడు గౌతమ్‌ను పంపించటం.. తనవంతుగా తిరిగి పార్టీలో చేరే రాయబారం పంపినట్లు తెలిసింది. వరుసగా రెండు రోజులు గౌతమ్ మహానాడుకు హాజరవటంతో దేవయ్య పార్టీలో చేరే సంకేతాలు కూడా బలపడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement