సారీ మమ్మీ... | student commits suicide for poor performance in exams | Sakshi
Sakshi News home page

సారీ మమ్మీ...

May 27 2014 12:45 PM | Updated on Nov 9 2018 5:02 PM

సారీ మమ్మీ... - Sakshi

సారీ మమ్మీ...

ఇంటర్ ఫెయిల్ కావడంతో పాటు మరో పరీక్ష కూడా సరిగా రాయలేకపోవడంతో ఓ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్:  ఇంటర్ ఫెయిల్ కావడంతో పాటు మరో పరీక్ష కూడా సరిగా రాయలేకపోవడంతో ఓ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఉప్పల్ చిలుకానగర్‌లో ఉండే బాలాచారి, శ్యామల దంపతులకు వి.భానుప్రకాశ్ (17), అఖిల్  అనే ఇద్దరు కుమారులున్నారు. భానుప్రకాశ్ హబ్సిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.

ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో భానుప్రకాశ్ ఫిజిక్స్‌లో తప్పాడు. అప్పటి నుంచి తీవ్ర వేదనకు గురవుతున్నాడు. సోమవారం బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫిలాని (బిట్‌శాట్) ప్రవేశ పరీక్ష ఉంది. ఈ పరీక్ష కేంద్రం సెక్రటరియేట్ మై హోం సరోవర్ ప్లాజా భవనంలోని ఎడిక్విటీ కెరీర్ టెక్నాలజీస్‌లో ఉండటంతో.. తండ్రి బాలాచారి ఉదయం 8.30కి భానుప్రకాశ్‌ను సెంటర్ వద్ద వదిలి వెళ్లారు.  11.30కి పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు భానుప్రకాశ్.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి తల్లికి ఫోన్ చేసి ‘సారీ మమ్మీ ఈ పరీక్ష కూడా బాగా రాయలేకపోయా’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె ప్రయత్నించగా ఫోన్ కలువలేదు.
 
సాయంత్రం 3.30కి ఎస్డీరోడ్‌లోని తాజ్‌మహాల్ హోటల్ ఎదురుగా ఉన్న శ్రీనాథ్ కమర్షియల్ కాంప్లెక్స్ భవనం 6వ అంతస్తుకు చేరుకున్న భానుప్రకాశ్ అక్కడి నుంచి కిందికి దూకాడు. వెంటనే స్థానికులు గమనించి మహంకాళి పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భానుప్రకాశ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికీ తరలించారు. మహంకాళి ఎస్సై విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తండ్రి బాలాచారి, కుటుంబ సభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement