గీత దాటితే దుకాణం బంద్! | Store shutdown is longer than the line! | Sakshi
Sakshi News home page

గీత దాటితే దుకాణం బంద్!

Jul 6 2015 2:57 AM | Updated on Sep 3 2017 4:57 AM

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఫార్మసీ దుకాణాలు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని

సంగారెడ్డి క్రైం : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఫార్మసీ దుకాణాలు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ సీహెచ్ రాజవర్ధనాచారి హెచ్చరించారు. ఇటీవల ఆయన విజయవాడ నుంచి బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యంగా లెసైన్సులు లేని షాపులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ‘ఇటీవల జహీరాబాద్‌లోని ఓ మెడికల్ షాప్‌లో కాలం చెల్లించిన మందులను విక్రయించగా దాడులు నిర్వహించి పట్టుకున్నాం.

ఆ దుకాణంపై కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేశాం. అభ్యంతరకరమైన ప్రకటనలకు సంబంధించి సిద్దిపేటలో ఐదు కేసులు నమోదు చేశాం. జిల్లా వ్యా ప్తంగా మొత్తం 70 ఫార్మసీల్లో తనిఖీలు నిర్వహించి కొన్నింటికి నోటీసులు పంపాం. ఈ నోటీసులకు యజమానులు స్పందించకుంటే చర్యలకు ఉపక్రమిస్తాం. అన్ని మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. జిల్లాలోని చాలా దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండా మం దులు విక్రయిస్తున్నట్టు ఇటీవల చేసిన దాడుల్లో వెల్లడైంది. ఇక నుంచి అలా జరుగకుండా వారికి నోటీసులు జారీ చేశాం. ఏ ఒక్క దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తాం. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అమ్మాలి’ అని రాజవర్ధన్ చెప్పారు.
 
 క్రిమినల్ కేసులకూ వెనకాడం...  
 ‘ఫెన్సిడిల్ వంటి మత్తు మందులను డాక్టర్ సూచించిన వారికి మాత్రమే విక్రయించాలి. కొందరు యువకులు ఇలాంటి మత్తునిచ్చే మందులకు అలవాటు పడి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా మెడిసిన్స్ విక్రయిస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా కూడా పెట్టాం. డాక్టర్ సూచించిన ప్రి స్క్రిప్షన్ ఆధారంగానే మందులు విక్రయించాలి. అలాగే వినియోగదారులకు తప్పకుండా రశీదు ఇవ్వాలి.

రశీదు ఇవ్వడానికి ఎక్కువ బిల్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ఆర్‌ఎంపీ వైద్యులు సైతం తమ ఫార్మసీ విక్రయాల కోసం లెసైన్సులు రెన్యూవల్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫిజీషియన్ శాంపిల్స్‌ను విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు వస్తే సదరు వైద్యులు, క్లినిక్‌లపై కూడా కేసులు నమోదు చేస్తాం. వైద్యులు తమ క్లినిక్‌లలో కూడా మందులను నిబంధనల మేరకే విక్రయించాలి. ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగినా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులు మాకు నేరుగానైనా లేదా 08455-276548 ఫోన్ నంబర్‌కు అయినా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు’ అని రాజవర్ధనాచారి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement