ఈజీగా..

SRDP Scheme For Solve Traffic Problems in Hyderabad - Sakshi

సాఫీ ప్రయాణానికి ప్రణాళికలు

డీపీఆర్‌లు అందాక పనులకు శ్రీకారం

అంచనా వ్యయం దాదాపు రూ.4400 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఇప్పటికే వివిధ మార్గాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ..త్వరలో మరో ఏడు కారిడార్లలో ‘ట్రాఫిక్‌ ఫ్రీ’ చర్యలు చేపట్టనుంది. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఎక్కడ ఏవి అవసరమైతే ఆ పనులు చేయనుంది. అందులో భాగంగా మరికొన్ని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు జరుగనున్నాయి. ఏయే మార్గాల్లో ట్రాఫిక్‌ పరిష్కారానికి ఏయే పనులు చేయాలో డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ల కోసం కన్సల్టెంట్లకు బాధ్యతలప్పగించారు. 

కన్సల్టెంట్‌ సంస్థలనుంచి డీపీఆర్‌లు అందాక టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఓవైపు ఇప్పటికే పనులు ప్రారంభమైన ఎల్‌బీనగర్‌ జంక్షన్, కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్,బయోడైవర్సిటీపార్క్‌ జంక్షన్, షేక్‌పేట్‌ సెవెన్‌ టూంబ్స్, ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ జంక్షన్, ఓయూకాలనీజంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్, దుర్గంచెరువుపై కేబుల్‌స్టే బ్రిడ్జి, తదితర పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు మరోవైపు ఈ కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ, కామినేని, మైండ్‌స్పేస్‌ల వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడంతో  నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ వీలైనంత త్వరితంగా ట్రాఫిక్‌చిక్కుల్ని తొలగించాలని భావిస్తున్నారు. తాము చేపట్టిన ఫ్లై ఓవర్లు,తదితర పనులతోనే మరోమారు నగర ప్రజలు అధికారం కట్టబెట్టారని భావిస్తోన్న టీఆర్‌ఎస్‌  నేతలు సైతం ఎస్సార్‌డీపీ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.

ట్రాఫిక్‌ చిక్కులు తొలగనున్న కారిడార్లు ఇవే...
సంగీత్‌ జంక్షన్‌–ఉప్పల్‌–ఎల్‌బీనగర్‌ క్రాస్‌రోడ్స్‌ (అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు).
సచివాలయం– ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం–లిబర్టీ– బషీర్‌బాగ్‌– జీపీఓ– అఫ్జల్‌గంజ్‌ (రూ. 500కోట్లు).
పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌–హయత్‌నగర్‌–ఎల్‌బీనగర్‌ క్రాస్‌రోడ్స్‌ (రూ.600 కోట్లు).
ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌–పంజగుట్ట–బేగంపేట–హరిహరకళాభవన్‌–సంగీత్‌ జంక్షన్‌( రూ.800 కోట్లు).
తార్నాక–మౌలాలి–ఈసీఐఎల్‌క్రాస్‌రోడ్స్‌–దమ్మాయిగూడ (రూ.500 కోట్లు).
ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌–నేరేడ్‌మెట్‌–తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌(రూ. 300 కోట్లు).
జేబీఎస్‌–ఆర్‌పీరోడ్‌– నెక్లెస్‌రోడ్‌–సెక్రటేరియట్‌–లక్‌డికాపూల్‌–మాసాబ్‌ట్యాంక్‌ జంక్షన్‌(రూ. 1200 కోట్లు).

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top