జస్టిస్‌ ఫర్‌ 'దిశ'.. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు

Special Fast Track Court Has Been Set up For Justice For Disha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ మొదటి అదనపు సెషన్స్‌ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్‌ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. 

సీఎం ఆదేశాల మేరకు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఈనెల 2వ తేదీన హైకోర్టుకు లేఖ రాశారు. ఈ మేరకు ఆ తర్వాతి రోజే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆమోదముద్ర వేశారు. హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నంబర్‌ 639) జారీ చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top