మహిళలకు నీటి కష్టాలు దూరం

Solution Soon To Drinking Water Problem Rangareddy - Sakshi

కొడంగల్‌ (రంగారెడ్డి): మహిళల కన్నీటి కష్టాలను దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ శివారులోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను కొడంగల్‌కు రప్పించి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్‌ భగీరథలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల కోట్లు, కొడంగల్‌కు రూ.267 కోట్లు ఖర్చుచేసి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.

ప్రస్తుతం వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలుచేయని విధంగా కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లకుండా తమ ఇంట్లోనే ధీమాగా కుళాయి వద్ద నీళ్లను పట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 13న కొడంగల్‌ మురహరి ఫంక్షన్‌ హాల్‌లో రైతులకు ఇన్సూరెన్స్‌ బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత రెండో విడత రైతు బంధు  చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పంద్రాగస్టు నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 229 టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ జెడ్పీటీసీలు ఏన్గుల భాస్కర్, కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల రైతు సమాఖ్య అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి, ప్రహ్లాద్‌రావు, మహిపాల్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top