సింగరేణికి ఏడాదికి రూ.35 వేల కోట్లు 

Singareni is worth Rs 35,000 crore annually - Sakshi

సూపర్‌బజార్‌ (కొత్తగూడెం): రాబోయే ఐదు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ సంవత్సరానికి రూ.35 వేల కోట్ల నికర ఆదాయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొ న్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయన శ్రీధర్‌ విలేకరులతో మాట్లాడారు. 2013 నుంచి సింగరేణి సంస్థ నికరలాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించిందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరం నుంచి 50 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మైలురాయిని అధిగమిస్తూ వస్తోందని అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గతంలో సింగరేణి రూ.400 కోట్లకు మించి లాభాలను సాధించలేకపోయిందని, ఇప్పుడు కార్మికులు, ఉద్యోగుల సమైక్య కృషి, ప్రభుత్వ సహకారంతో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించే స్థితికి చేరుకుందని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మరో 12 గనులను కొత్తగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా 6 గనులను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్‌ ఉత్పత్తిలో కూడా దేశంలోనే 5వ స్థానంలో సింగరేణి సంస్థ నిలవడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top