కొలిచిన వారికి 'బంగారు తల్లి' | Know Interesting Facts About Peddamma Talli Temple Palvancha Bhadradri Kothagudem In Telugu | Sakshi
Sakshi News home page

కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..

Sep 18 2025 7:41 AM | Updated on Sep 18 2025 10:59 AM

Peddamma Talli Temple Palvancha Bhadradri Kothagudem

‘పెద్దమ్మతల్లి అంటేనే అందరికీ పెద్దదిక్కు.. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది’ ఇదీ భక్తుల నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం అయితే వేల సంఖ్యలోనే వస్తారు. కొత్తగూడెం–భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) ఆలయం ఉంటుంది. ఆ రహదారి పై వెళ్లే ప్రతి ఒక్కరూ అమ్మవారికి నమస్కరించనిదే వెళ్లరంటే 
అతిశయోక్తి కాదు.   

ఇంతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం స్థలపురాణంలోకి వెళితే...పూర్వం ఇక్కడి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల మధ్యలో ఖమ్మం–భద్రాచలం వెళ్లే రాజమార్గం సమీపంలో ఒక పెద్దపులి సంచరిస్తూ ఉండేది. ఆ పెద్దపులి రాజమార్గం సమీపంలో గల ఒక చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సమీప గ్రామ ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా సాధు జంతువులా సంచరిస్తూ ఉండేది. 

ఈ పెద్దపులిని గ్రామ ప్రజలు, బాటసారులు రాజమార్గాన ప్రయాణించే వాహనదారులు వనదేవతగా, శ్రీకనకదుర్గ అమ్మవారి వాహనంగా భావించి భక్తితో పూజించేవారు. అలా ప్రణమిల్లిన వారి మనోభావాలు, వాంఛలు నెరవేరుస్తూ కాలక్రమంలో ఆ పులి అదృశ్యం కావడంతో చింతచెట్టు కింద అమ్మవారి ఫొటోను పెట్టి గ్రామప్రజలు పూజించేవారు. 1961–62లో శ్రావణపు వెంకటనర్సయ్య అమ్మవారి దేవాలయం నిర్మించేందుకు కొంత స్థలం దానం ఇవ్వగా.. కంచర్ల జగ్గారెడ్డి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ పెద్దమ్మతల్లికి దేవాలయం నిర్మించి శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

నాటినుంచి స్మార్త సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా వనదేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆది, గురువారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

వివాహాది శుభకార్యాలు ఏవైనా ఇక్కడే..
శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి)లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తుంటారు. అంతేకాక ప్రతియేటా అమ్మవారి ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. 

పిల్లలకు బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ కార్యక్రమాలు... ఇలా ఏ శుభకార్యమైనా అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తుండడం ఆనవాయితీ. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక ‘పొంగల్‌ షెడ్‌’తోపాటు ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న వివిధ ఫంక్షన్‌ హాళ్లలో నిత్యం ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి.

నవరాత్రులు ప్రత్యేకం..
పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల΄ాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి.. అన్ని రకాల పూజలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ మంగళ గౌరీదేవి, శ్రీ మహిషాసుర మర్థనీదేవి అలంకారాలు నిర్వహించి.. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామసేవ, శమీపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎవరు వాహనం కొనుగోలు చేసినా ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజ చేయించాల్సిందే. 

నవరాత్రుల సమయంలో ఆయుధపూజ రోజున ప్రత్యేకంగా వేలాది వాహనాలకు పూజలు చేయించడం విశేషం. ఇక్కడ పూజలు చేయిస్తే ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ప్రయాణం సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమీప ప్రాంత రైతులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు.

ఆలయ విశేషాలు..
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉంటాయి. ఈ మహావృక్షాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షానికి ఊయలకట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని మహిళలు గర్భం దాలుస్తారని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. 

బస్సు మార్గం..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్‌ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్లే ప్రతి బస్సు అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్తాయి. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు డి΄ోలకు చెందిన బస్సులు ప్రతినిత్యం ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. 

రైలు మార్గం..
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కొత్తగూడెం(భద్రాచలంరోడ్‌ రైల్వే స్టేషన్‌) వరకు రైలు సౌకర్యం ఉంది. ఖమ్మం వరకు రైలు మార్గం ఉంది. ఖమ్మం నుంచి 100 కి.మీ., కొత్తగూడెం నుంచి నుంచి 20 కి.మీ. దూరంలోగల అమ్మవారి ఆలయం మీదుగా నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.
– గగనం శ్రీనివాస్, సాక్షి, పాల్వంచ రూరల్‌

(చదవండి: ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..! ఏకంగా పదకొండు అలంకరాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement