నాసి..అందుకే మసి! 

Short Circuits Happening Frequently In Metro Cities - Sakshi

తగ్గిన విద్యుత్‌ వినియోగం.. అయినా ఆగని షార్ట్‌సర్క్యూట్‌లు 

భవిష్యత్తు అవసరాలు గుర్తించకుండా వైరింగ్‌ పనులు 

సాక్షి, రంగారెడ్డి: గత మూడు నెలల నుంచీ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అహ్లాదంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత కూడా అంతగా లేదు. ఫలితంగా బహుళ అంతస్తుల్లో కొనసాగుతున్న వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం కూడా తగ్గింది. అయితే ఆయా భవనాల్లో వర్షాకాలంలోనూ  షార్ట్‌సర్క్యూట్స్‌ వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని నాగసాయి న్యూపాలిమార్‌ ప్లాస్టిక్‌ సంచుల తయారీ కంపెనీ సహా మలక్‌పేట్‌ సలీమ్‌నగర్‌లోని ఆదిహోం డా షోరూంలో భారీ అగ్నిప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

ఆయా భవన నిర్మాణాల సమయంలో భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు సామర్థ్యం గల కేబుళ్లను ఎంపిక చేయకపోవడం, ఒకేపిన్‌ నుంచి మూడు నాలుగు ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కనెక్షన్లు ఇస్తుండటం వల్ల కేబుళ్లు అధిక ఒత్తిడిలోనై షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం విధులు ముగిసిన తర్వాత చాలా మంది ఆయా స్విచ్‌లను ఆఫ్‌ చేయకుండా పోతున్నారు. ఈదురు గాలితో కూడిన వర్షం కురిసినప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తడం, ఇలా కరెంట్‌ వచ్చిపోయినప్పుడు జాయింట్ల వద్ద అగ్నికీలలు ఎగిసిపడి విలువైన వస్తువులు దగ్ధమవుతున్నట్లు మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.     

అవసరాలు గుర్తించకుండా కేబుల్‌ పనులు
ప్రస్తుతం నగరంలో భారీ బహుళ అంతస్తుల భవనాలు(అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మాల్స్‌ 70 వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు బిల్డర్లు నిర్మించినవే. భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సమయంలోనే ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న విద్యుత్‌ కేబుళ్లు, స్విచ్‌లు, ప్లగ్‌పిన్‌లనే వాడాల్సి ఉన్నప్పటికీ...చాలా మంది తక్కువ సామర్థ్యం ఉన్న నాసిరకం వస్తువులను వాడుతున్నారు.

తీరా ఆయా భవనాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత అధిక లోడుతో కేబుల్‌ వేడెక్కి షార్ట్‌సర్క్యూట్‌లు జరుగుతున్నట్లు తెలిసింది. నిజానికి భవిష్యత్తు విద్యుత్‌ వినియోగం, ప్యానల్‌ బోర్డ్, కేబుల్, ఎర్తింగ్‌ వంటి పనులను నిర్మాణ సమయంలోనే విద్యుత్‌ తనిఖీ విభాగం అధికారులు పరిశీలించాలి. నిర్ధేశిత ప్రమాణాలకు అనుగుణంగా కేబుల్, లైన్లు ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ఆయా బహుళ అంతస్థుల భవనాలకు ధృవీకరణ పత్రం జారీ చేయాలి. కానీ విద్యుత్‌ తనిఖీ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అడిగినంత ముట్టజెప్పితే చాలు కనీసం భవనాలను తనికీ చేయకుండానే సర్టిఫికెట్స్‌ జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

అబిడ్స్‌ కేంద్రంగా నకిలీ కేబుళ్ల దందా 
నకిలీ విద్యుత్‌ కేబుళ్లు, స్విచ్‌లు, త్రిపిన్‌ ప్లగ్‌ల అమ్మకాల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. బ్రాండెడ్‌ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా వీటిని తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. నగరంలోని అబిడ్స్‌ కేంద్రంగా ఈ నకిలీ కేబుళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

షాపులో పది బాక్కుల కేబుల్‌ కొంటే వాటిలో మూడు నుంచి నాలుగు బాక్సుల కేబుల్‌ నకిలిదే బయటపడుతుండటంతో విద్యుత్‌ వర్కర్లు సైతం విస్తుపోతున్నారు. నగరంలో తరచూ వెలుగు చూస్తున్న షార్ట్‌సర్క్యూట్‌లలో 40 శాతం ప్రమాదాలకు నాసిరకం కేబుళ్లు, స్విచ్‌లు, ఫ్యూజ్‌లే కారణమని విద్యుత్‌ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు.   

ఇటీవల వెలుగు చూసిన మచ్చుకు కొన్ని ప్రమాదాలుః 
మలక్‌పేటలోని ఆదిహోండా హోండా షోరూంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాబై బైకులు మంటల్లో దగ్ధమైనట్లు అంచనా. రూ.లక్షల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది.  
కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని నాగసాయి న్యూపాలిమార్‌ ప్లాస్టిక్‌ సంచుల తయారీ కంపెనీలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.  

ఏడాది క్రితం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాత్కాలిక దుకాణాలు సహా రూ.లక్షల విలువ చేసే వస్తువులన్నీ అగ్నికి ఆహూతైపోయాయి. 
ఆరు నెలల క్రితం బాబూఖాన్‌ ఎస్టేట్‌ ఏడో అంతస్థులో వెలుగు చూసిన షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఏసీలు, కంప్యూటర్లు సహా కీలక వస్తువులు, ఫైళ్లు దగ్దం అయ్యా యి. నారాయణగూడ విఠల్‌వాడిలో గల నారాయణ కళాశాలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించింది. విలువైన ఫర్నిచర్‌ దగ్థ మైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యార్థులెవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top