ఉదయాన్నే వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలునిపై వీధికుక్క దాడిచేసింది.
- వీధి కుక్కదాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
- తలపై చర్మం తెగి విలవిల
- ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి కాలినడకన
- చూపరులను కలచివేసిన ఘటన
హైదరాబాద్: ఉదయాన్నే వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలునిపై వీధికుక్క దాడిచేసింది. తలపై పది అంగుళాల మేర చర్మాన్ని కొరికేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మాసబ్‌ట్యాంక్ చాచానగర్ పార్క్ సమీపంలో నివాసముంటున్న నాగరాజు కుమారుడు శివ(9) ఆదివారం ఉదయం 7 గంటలకు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క బాలునిపై దాడిచేసి తల కుడి చెవిపైభాగంలో కరిచింది. దీంతో పది అంగుళాల మేర మాంసం ముద్దతోపాటు చర్మం లేచిపోయి పుర్రె ఎముక బయటకు వచ్చింది.
అదే విధంగా ఎడమ చెవి భాగంలో భుజాలు, చేతులపై కరిచి గాయపర్చింది. అది గమనించిన బాటసారులు కుక్కను కొట్టి తరిమేశారు. తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న బాలున్ని తల్లిదండ్రులు చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాలుని తలపై ఉన్న కుక్కకాటు గాయాలను శుభ్రం చేసిన వైద్యులు 15 వాయిల్స్ రిగ్ ఇంజెక్షన్‌లు ఇచ్చారు. తలపై గాయాలు తీవ్రంగా ఉండడంతో తదుపరి చికిత్సల కోసం బాలున్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు.
ఆర్ధిక భారంతో కాలినడకన వచ్చిన బాధితులు
కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుక్క దాడిలో గాయపడిన బాలున్ని మాసబ్ ట్యాంక్ నుంచి కాలి నడకన ఫీవర్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. తిరిగి ఉస్మానియా ఆస్పత్రికి కూడా నడిచి వెళుతుండగా... గమనించిన ఓ వ్యక్తి సహృదయంతో ఆటో చార్జీలకు డబ్బులు ఇచ్చారు.